పెదపట్నంలంకలో మెయిన్ రోడ్డుపై కూలిపోయిన చింత చెట్టు
సాక్షి, అమలాపురం : ప్రళయభీకర రూపు దాల్చి, హరిత సీమపై పంజా విసురుతున్న అతి తీవ్ర తుపాను ‘అర్నబ్’ జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచే ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాయంత్రం నుంచి కుండపోతగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకృతి ప్రకోపానికి సాగర తీర మండలాలు వణికిపోతున్నాయి. ఎటు చూసినా భీతిగొలిపే వాతావరణం.. ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన.. వెరసి అర్నబ్ తుపాను కోనసీమకు పెను విపత్తుగా మారింది.
భీకర శబ్దంతో..
జిల్లాలో వాతావరణం ఉదయం తుపాను ముందు ప్రశాంతత అన్నట్టుగా ఉంది. మబ్బులు కూడా లేకుండా ఆకాశం నిర్మలంగా కనిపించింది. అటువంటిది సాయంత్రానికల్లా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆ సమయంలో సాధారణంగా మొదలైన గాలులు క్రమంగా వేగం పుంజుకున్నాయి. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులతో వస్తున్న శబ్దం భయంగొలిపేదిగా ఉంది. ఇళ్ల తలుపులు బద్దలైపోతాయేమోనన్నంతగా గాలుల తీవ్రత ఉంది. ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో గాలుల తీవ్రత అధికంగా ఉంది. అల్లవరం మండలం ఓడలరేవు తీరం వెంబడి సాయంత్రానికే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన పెను గాలులు ప్రారంభమయ్యాయి. సముద్రంలో ఉప్పెన వస్తుందేమోన్నంతగా గాలుల ఉధృతి ఉండటంతో ప్రజలు హడలెత్తారు. పలు ప్రాంతాల్లో గాలుల ధాటికి కొబ్బరి చెట్లు ఈను పుల్లల్లా విరిగిపోయి, నేలకొరుగుతున్నాయి. కొబ్బరి కాయలు, ఆకులు తెగిపోయి ఎగిరి పడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. అర్ధరాత్రి సమయానికి గాలుల తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల రహదారులపై భారీ వృక్షాలు సైతం విరిగిపడుతూండటంతో రాకపోకల కు అంతరాయం కలుగుతోంది. కొన్నిచోట్ల ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు బితుకుబితుకుమంటున్నారు. 216 జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. సావిత్రీ నగర్లో సముద్రపు నీరు 3 నుంచి 4 అడుగుల మేర ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొమరిగిరిపట్నం ఆక్వా చెరువుల వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నానిరాజు, మరో 8 మంది చిక్కుకుపోయారు. తోటల్లోను, రోడ్లు వెంబడి పూరి పాకల్లో ఉన్న జనం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సాగరం.. ఉగ్రరూపం
తుపాను ఉధృతికి సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. తీర ప్రాంతంలోని అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరం మీదకు దూసుకొస్తున్నాయి. కొన్నిచోట్ల సరుగుడు తోటల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి, గాలుల వేగం కలిపి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. సముద్ర కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సముద్ర అలలు గోదావరి నదీపాయల ద్వారా చొచ్చుకుని వస్తున్నాయి. దీంతో, మురుగునీటి డ్రైన్లలో ముంపు నీరు గట్లు దాటి ఉరకలెత్తుతోంది. గాలుల తీవ్రత చూస్తుంటే 1996 పెను తుపాను మాదిరిగా ఉప్పెన వస్తుందేమోనని మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతు న్నారు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లోని మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారు.
అంధకారంలో..
గాలుల ధాటికి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగి పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6 గంటల నుంచి రామచంద్రపురం డివిజన్ మినహా అమలాపురం, కొత్తపేట డివిజన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు చీకట్లో చిక్కుకున్నాయి. బయట ప్రచండ గాలులు, భారీ వర్షం.. లోపల అంధకారం.. వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రే తీరాన్ని తాకిన తుపాను
అర్నబ్ తుపాను యానాం సమీపాన తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అనంతరం, కోనసీమలోని కాట్రేనికోన మండలం చిర్ర యానాం సమీపాన లేదా అల్లవరం – మామిడికుదురు మండలాల సరిహద్దులో వైనతేయ గోదావరి నది సాగర సంగమ ప్రాంతం వద్ద తీరం దాటవచ్చని భావించారు. దీంతో, తుపాను గమనం ఎప్పుడు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. చివరకు రాత్రి 8.30 గంటల సమయానికి ఈ తుపాను కోనసీమ తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అంతకుముందు గడచిన 6 గంటల్లో ఈ తుపాను గమన వేగం గంటకు 18 కిలోమీటర్లకు పెరిగింది. దీంతో, తుపాను బాహ్య వలయం కోనసీమ రాత్రి 8.30 గంటల సమయానికే తీరాన్ని తాకినట్లు గుర్తించారు. ఇది బుధవారం వేకువజామున 2 నుంచి 4 గంటల మధ్య అమలాపురం – అంతర్వేది నడుమ తీరం దాటవచ్చని అంచనా వేశారు. అయితే, ఈ తుపాను అర్ధరాత్రి 12 నుంచి 1.30 గంటల మధ్యన మలికిపురం మండలం శంకరగుప్తం – సఖినేటిపల్లి మండలం అంతర్వేది మధ్య తీరం దాటే అవకాశముందని రాత్రి 11.30 గంటల సమయంలో కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. కాట్రేనికోనలో గంటకు 100 కిలోమీటర్లు, ఐ.పోలవరంలో 97, ముమ్మిడివరంలో 92, అమలాపురంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయని వివరించారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత మరింత పెరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, సింగపూర్ శాటిలైట్ సమాచారం ప్రకారం ఈ తుపాను ఓడలరేవు – శంకరగుప్తం మధ్య తీరం దాటుతున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావుకు ఓఎన్జీసీ అధికారులు సమాచారం ఇచ్చారు. అప్పటికి భూమి మీద గాలి వేగం 90 కిలోమీటర్లు ఉండగా తుపాను తీరం దాటే ప్రాంతంలో 200 కిలోమీటర్లకు పెరిగిందని చెబుతున్నారు. మొత్తం మీద తుపాను ప్రభావంతో జిల్లా వాసులకు మంగళవారం రాత్రంతా కంటి మీద కునుకు కరువైంది. తీరం దాటిన తరువాత కూడా బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తుపాను ఏ బీభత్సం సృష్టిస్తుందో, దీని తీవ్రత ఎప్పుడు తగ్గుతుందోనని కోనసీమ ప్రజలు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.
ఫ హరితసీమపై ‘అర్నబ్’ పంజా
ఫ ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కడలి
ఫ జిల్లాలో ప్రచండ గాలులు.. భారీ వర్షం
ఫ నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు
ఫ విరిగి పడుతున్న విద్యుత్ స్తంభాలు
ఫ అంధకారంలో కోనసీమ
ఫ అమలాపురం – అంతర్వేది మధ్య
తీరం మీదికి తుపాను


