● అన్నదాత గుండెల్లో ‘అర్ణాబ్’
● కోతకొచ్చిన ఖరీఫ్ పంట
● ముంచుకొస్తున్న తుపాను ముప్పు
● కోస్తా ప్రాంతంలోనే
తీరం దాటే అవకాశం
● హెచ్చరించిన వాతావరణ శాఖ
సాక్షి, అమలాపురం: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ప్రకృతి మరోసారి రైతును పరీక్షిస్తుంది. ఖరీఫ్ సాగు మొదలైనప్పటి నుంచి నీటి ఎద్దడితో సతమతమైన అన్నదాతకు కోతల వేళ ‘అర్ణాబ్’ రూపంలో మరో ముప్పు ఎదురవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుపానుగా మారి కోస్తా జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాత గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తుపాను రాక సూచనగా శనివారం జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి సోమవారానికి తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలు కోస్తా రైతులను కలవరపెడుతున్నాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు కాకినాడ, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసింది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో వరి పంటకు నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు భయపడుతున్నారు. తుపానుతో సముద్రం అలజడిగా మారుతుందని,మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
1.53 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో సుమారు 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో దాదాపు 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు అంచనా. అయితే ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచే రైతులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు నమోదైనా గోదావరిలో నీటి లభ్యత ఉండటంతో డెల్టాకు నీటి ఇబ్బందులు ఉండవని భావించారు. కానీ కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ శివారు ప్రాంతాలకు సకాలంలో చేరకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీరున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, అధ్వాన నీటి యాజమాన్యం వల్ల జిల్లాలో కొత్తపేట, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన తదితర మండలాల్లో పలుచోట్ల నారుమడులు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చేలు బీడుగా మారగా.. మరికొందరు రైతులు సాగు చేయడానికే వెనకడుగు వేశారు.
నీరు సక్రమంగా చేరక..
తీరప్రాంత మండలాల్లో మురుగునీటి కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపింది. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోకపోవడం, అందుబాటులో ఉన్న నిధులతోనూ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో వేలాది ఎకరాల్లో సాగు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు పంట కాలువలకు జూన్ 1న నీరు విడుదల చేసినప్పటికీ, శివారు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జూన్ 20 తరువాత, మరికొన్ని ప్రాంతాల్లో జూలై మొదటి వారంలో నీరు చేరింది. దీంతో నాట్లు ఆలస్యమయ్యాయి. పంట ఎదుగుదలలో తేడాలు రావడంతో కోతల సమయం కూడా ప్రాంతాల వారీగా మారింది.
మరో వారంలో కోతలు
జిల్లాలో ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధి లో మరో వారం నుంచి పది రోజుల్లో ఖరీఫ్ వరి కోత లు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ పంట లు కోత దశకు చేరుకున్నాయి. కొత్తపేట, పి.గన్నవరం, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వరి గింజలు గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నవంబర్ 15 తరువాత కోతలు ప్రారంభమయ్యే అవ కాశముంది. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం వంటి శివారు ప్రాంతాల్లో నవంబర్ 20 తరువాత కోతలు మొదలయ్యే పరిస్థితి ఉంది.
నేలవాలితే నష్టమే..
భారీ వర్షాలు కురిసి చేలల్లో నీరు నిలిచినా, బలమైన గాలులకు వరి పైరు నేలవాలినా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట గాలివానలకు నేలవాలితే కోతలు కష్టమవడంతో పాటు గింజలు రాలిపోవడం, ధాన్యం తడిసి నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన పనలను పొలాల్లోనే ఉంచాల్సి వస్తే అవి తడిసి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి, సాగు ఖర్చుల భారం మోస్తున్న రైతులకు ఇప్పుడు పంట చేతికందుతుందో లేదోనన్న భయం పట్టుకుంది. సాగు ప్రారంభంలో నీటి యాజమాన్య సమస్యలు.. మధ్యలో పంట ఎదుగుదలలో ఇబ్బందులు.. ఇప్పుడు కోతల వేళ తుపాను ముప్పు.. అన్నదాతను ఇబ్బంది పెడుతోంది.
ఆలమూరు మండలం పెనికేరులో కోతలకు సిద్ధంగా ఉన్న వరి చేలు


