కాట్రేనికోన: స్థానిక పంచాయతీ శివారు తిమ్మాపురంలోని శ్రీవెంకట కళ్యాణి ట్రేడర్స్ బాణసంచా దుకాణాన్ని అమలాపురం డీఎస్పీ ఎస్‌ఆర్‌కే ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీపావళి మందుల దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, నీటి సదుపాయాన్ని పరిశీలించారు. దీపావళి మందుల దుకాణాల నిర్వాహకుల లైసెన్సు నిబంధనలు పాటించాలని, నో స్మోకింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. షాపుల వద్ద నిర్వాహకులు అనుమతులకు మించి బాణసంచా నిల్వలు ఉంచరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్, కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
ముమ్మిడివరం: స్థానిక నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముమ్మిడివరం బాలికల జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ పరిసరాలను శనివారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్‌లో 6 టేబుళ్ల నుంచి 8 టేబుళ్లకు పెంచి లెక్కింపు వేగవంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ పి.రవవర్మకు సూచించారు. ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అన్నారు.
ఎన్నికల విధుల నుంచి
మినహాయింపు ఇవ్వండి
అమలాపురం రూరల్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, చిన్న పిల్లలు కలిగిన, బాలింతలు, గర్భిణులైన ఉపాధ్యాయినులు, 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏపీపీటీఏ) కోనసీమ జిల్లా శాఖ డీఆర్‌ఓను కోరారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు అధ్యక్షతన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ఎన్నికల విధులపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏపీపీటీఏ) జిల్లా శాఖ అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణిలు డీఆర్‌ఓను కలసి వినతిపత్రం అందించారు. ఎన్నికల్లో ఉపాధ్యాయినిలకు సమీప పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీలు వేయాలని, తాగునీరు, విశ్రాంతి, భద్రతా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.
కిటకిటలాడిన రత్నగిరి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆల య ప్రాంగణం రద్దీగా మారింది. వ్రత మండపా లు నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.


