సాక్షి, అమలాపురం: దసరా పండగంటే సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలసి పండగ చేసుకోవాలనే ఆనందం.. కానీ ఈసారి ఆ ఆనందాన్ని రానుపోను ఖర్చులు నీరుగారుస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు దసరా సందర్భంగా పెద్ద ఎత్తున సొంత ప్రాంతాలకు తరలిరానుండగా.. రైలు, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.వెయ్యి లోపు ఉండే సిటింగ్.. రూ.1500 లోపు ఉండే స్లీపర్ చార్జీలు దసరాకు రెట్టింపు చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భారంగా మారనుంది.
ఈ నెల 20న దసరా పండగ జరగనుంది. ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి 22వ తేదీ గురువారం వరకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. 10వ తేదీ శనివారం, 11న ఆదివారం కావడంతో 9వ తేదీ నుంచే విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు సొంతూళ్లకు బయలుదేరే అవకాశం ఉంది.
‘వెయిటింగ్’ చాంతాడంత!
హైదరాబాద్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే వారి తాకిడి అధికంగా ఉంటోంది. అందుకు అక్కడ నుంచి ఉమ్మడి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని తదితర ప్రాంతాల తోపాటు కోనసీమను ఆనుకుని ఉన్న నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాలకు రైలు ద్వారా చేరుకునే వారు అధికంగా ఉంటారు. అయితే గౌతమి, గోదావరి, కోకనాడ, నర్సాపూర్ వంటి ప్రధాన రైళ్లలో నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ అయిపోయాయి. చైన్నె, బెంగళూరు నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, సామర్లకోట, తుని తదితర ప్రాంతాలకు వచ్చే రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇదే పరిస్థితి. దసరా అనంతరం 22వ తేదీ నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ వెయిటింగ్ భారీగా ఉంది. దీంతో రైల్వే ప్రయాణంపై ఆధారపడే వారికి టికెట్ దొరకడం కష్టంగా మారింది. కొంతమంది తత్కాల్ మీద ఆశలు పెట్టుకున్నా
దొరికే అవకాశాలు తక్కువే.
హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్లు దాదాపు నిండిపోయాయి. అమలాపురంతోపాటు కాకినాడ, రామచంద్రపురం, తుని వంటి ప్రాంతాలకు 80 శాతం సీట్లు బుక్ అవ్వగా చాలా తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా బస్సుల వెనుక భాగంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరానికి మాత్రం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. పండగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి వెళ్లే సమయంలో కూడా అమలాపురం వంటి రద్దీ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల్లో దాదాపు సగానికి పైగా సీట్లు నిండుకున్నాయి. దసరా సందర్భంగా ఈ నెల 16 నుంచి 19 వరకు హైదరాబాదు నుంచి అమలాపురానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమలాపురం నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 50 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ప్రధాన అధికారి జి.సత్యనారాయణ తెలిపారు.
మొదలైన దసరా దందా
ఆర్టీసీ అరకొర సీట్లు..
రైల్వే వెయిటింగ్ లిస్టులతో
ప్రైవేటు ఆపరేటర్ల భారీ దోపిడీ
ఉమ్మడి జిల్లాకు రానున్న
ప్రయాణికులకు ధరల మోత
సిట్టింగ్.. స్లీపర్‌కు రూ.1500 నుంచి
రూ.2,500 వెచ్చించాల్సిందే
తిరుగు ప్రయాణంలోనూ అదే పరిస్థితి
ఇప్పటికే సీట్లు బ్లాక్ చేసిన ఆపరేటర్లు


