బిల్లుల్లో చిల్లులు! | - | Sakshi
Sakshi News home page

బిల్లుల్లో చిల్లులు!

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● ఎన్నికల వేళ నిధులు పక్కదారి

● చెల్లింపుల్లో సిబ్బంది చేతివాటం

● రామచంద్రపురంలో బట్టబయలు

రామచంద్రపురం రూరల్‌: అవకాశం దొరకాలే కానీ ఏదీ వదలబోమని నిరూపిస్తున్నారు కొందరు అధికారులు. స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల నిర్వహణకు విడుదల చేసే నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన నిధులను తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రపురంలో ఆ సమయంలో పని చేసిన తహసీల్దార్‌ ఎం.వెంకటేశ్వరరావు సంతకం లేకుండానే కార్యాలయ సిబ్బంది బిల్లులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది.

ఆ ఎన్నికల సమయంలో సిబ్బందికి శిక్షణ, సమావేశాలు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వరకు టీ, టిఫిన్‌, భోజనాలు, అల్పాహారం సమకూర్చేలా రాజమహేంద్రవరానికి చెందిన ఒక క్యాటరింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సదరు బిల్లులకు చెల్లింపులు చేశారు. అయినప్పటికీ భోజనాలు, స్నాక్స్‌, టిఫిన్స్‌, టేబుళ్లు, కుర్చీలు, టెంట్‌లు, షామియానాలను అమలాపురం నుంచి తెప్పించామంటూ బిల్లు నంబర్‌ 28లో రూ.3,00,290, మరో బిల్లు 35లో రూ.2,45,200 ఒకే క్యాటరింగ్‌ సంస్థ పేరున పెట్టి స్వాహా చేశారు. ఆ సంస్థ యజమాని ఆకుల ధర్మారావును ‘సాక్షి’ సంప్రదించగా తాము రామచంద్రపురానికి ఎటువంటి సామగ్రీ, ఆహార పదార్ధాలూ సరఫరా చేయలేదని చెప్పేశారు. ఆ బిల్లులు తమకే చెల్లించినట్టు ఉన్నాయని రెట్టించగా తాము అమలాపురంలో ఇచ్చిన బిల్లుల జెరాక్సు కాపీలు పెట్టుకుని ఉంటారని వివరించారు.

ఇదే తీరులో స్టేషనరీ కూడా అమలాపురం సమీపంలోని చిన్న పల్లెటూరు నడిపూడి నుంచి తెచ్చుకున్నామంటూ బిల్లు నంబరు 666తో రూ.2,04,566, మరో బిల్లు 667తో రూ.2,08,987, ఇంకో బిల్లు 668తో రూ.1,02,389, బిల్లు నంబరు 669తో రూ.1,06,372 స్వాహా చేశారు. ఆ బిల్లుల్లో ఉన్న ఇంటి నంబరు ఆధారంగా వెళ్లగా ఆ బిల్లుల్లో ప్రొప్రయిటర్‌గా పేర్కొన్న వ్యక్తి అత్తయ్య ఇల్లుగా తేలింది. నిజానికి అతని వ్యాపారం, జీఎస్‌టీ నంబరు అతడి భార్య పేరున ఉండగా, బిల్లుల్లో మాత్రం ప్రొప్రయిటర్‌గా అతని పేరు ఉంది. అతనిని ఫోన్‌లో సంప్రదించగా మొదట రాంగ్‌ నంబర్‌ అని కట్‌ చేశారు. మళ్లీ ఫోన్‌ చేసి ఆడిట్‌ జరుగుతోంది వివరాలు చెప్పాలని రెట్టించగా కొద్ది సరుకు సప్లయి చేశామని ఒకసారి, మొత్తం తామే పంపించామని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. రూ.50 వేలు మించి సరుకు విక్రయించినపుడు రవాణా చేయడానికి కచ్చితంగా ఈ వేబిల్లు తీయాల్సి ఉంటుంది. అసలు సరుకే పంపించకుండా రూ.లక్షల బిల్లులు ఇచ్చేయడంతో ఈ వేబిల్లు అంశం కీలకం అవుతుంది.

కేవలం రెండు బిల్లుల్లోనే రూ.11 లక్షలకు పైగా అవినీతి జరిగితే మరింత సమగ్ర విచారణ చేపడితే ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయో తేలాల్సి ఉంది. దీనిపై కలెక్టర్‌, ఎన్నికల అధికారి తక్షణం విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఆ బిల్లులతో సంబంధం లేదు

అక్రమ బిల్లుల వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్నికల సమయంలో తనకు తెలియజేయకుండా ఎటువంటి బిల్లులూ పెట్టవద్దని చెప్పడంతో తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు సంతకం తీసుకుని మాత్రమే పెట్టాను. ఆయన సంతకం లేకుండా పెట్టిన బిల్లులపై అప్పటి డిప్యూటీ తహసీల్దార్‌కు మాత్రమే తెలుసు. ఆమే అప్పటి డీడీఓగా ఉన్నారు.

– ఎం.సావిత్రి, అప్పటి తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement