కనుచూపు మేరంతా గుర్రపుడెక్క.. అక్కడక్కడ తూడు పెరిగిపోవడంతో.. పంటలకు నీరందించాల్సిన కాలువ కాస్తా.. పచ్చిక పరచిన పచ్చని దారిని తలపిస్తోంది. అయినాపురం – పేరాయి చెరువు ఇరిగేషన్ సెక్షన్ వానపల్లిపాలెం బ్రాంచ్ కాలువలో ఈ దుస్థితి నెలకొంది. కాలువ పొడవునా గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోవడంతో ప్రవాహం ముందుకు సాగక.. పంట భూములకు సక్రమంగా నీరందడం లేదు. దీంతో, వ్యవసాయానికి ఆటంకం కలుగుతోందని దిగువ ప్రాంత రైతులు వాపోతున్నారు, పశు సంరక్షకులు సైతం నీటిని వినియోగించుకొనే వీలు లేని పరిస్థితి నెలకొంది. ఈ కాలువ శివారున ఉన్న బొర్రాయిపాలెంలో సుమారు 90 దళిత కుటుంబాలున్నాయి. వారు సైతం తమ నిత్యావసరాలకు ఈ కాలువ నీటి పైనే ఆధారపడి ఉన్నారు. అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో శుభ్రమైన నీరు అవసరమైన స్థాయిలో అందటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
– ఉప్పలగుప్తం


