● కొబ్బరి మార్కెట్‌లో పండగ సందడి ● పెరిగిన ధర.. రైతులకు కాస్త ఊరట
● వెయ్యి పచ్చి కాయలకు రూ.22 వేలు ● నిల్వ కాయ ధర రూ.20 వేలు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పండగల సీజన్ కావడంతో కొబ్బరి మార్కెట్‌కు దస రా, దీపావళి బొనాంజా వచ్చింది. కొంత కాలంగా ధరల హెచ్చుతగ్గులతో సతమతమవుతున్న రైతులకు దసరా, దీపావళి పండగలు కొనుగోళ్లు కలసి వస్తున్నాయి. వారం రోజులుగా మార్కె ట్లో కొబ్బరి కాయల ధరలు పెరగడం వారికి కాస్త ఊరటనిస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో ప్రస్తుతం వెయ్యి పచ్చి కాయల ధర రూ.22 వేల వరకు ఉండగా, గోదావరి లంక గ్రామాల్లో వచ్చే కాయల ధర రూ.23 వేల వరకు పలుకుతోంది. నిల్వ కాయ (ముక్కుడు కాయ) ధర రూ.20 వేల వద్ద ఉంది. పండగల సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొబ్బరికి డిమాండ్ పెరగడం మార్కెట్‌కు ఊతమిస్తోంది.
పెరిగిన ఎగుమతులు
కోనసీమతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో వెయ్యి పచ్చి కాయల ధర రూ.24 వేల వరకు పలికింది. ముక్కుడు కాయ (నిల్వ కాయ) ధర కూడా రూ.22 వేలకు చేరింది. ధర ఒక్కసారిగా రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు పెరగడంతో రూ.25 వేల మార్కును చేరుతుందని రైతులు, వ్యాపారులు అంచనా వేశారు. అయితే, ఆ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా తిరగబడింది. వెయ్యి పచ్చి కాయ ధర రూ.19 వేలకు పడిపోయింది. అనంతరం, క్రమంగా కోలుకుని రూ.20 వేలకు చేరింది. వారం రోజులుగా ఇది రూ.22 వేల నుంచి రూ.23 వేల వరకు పెరిగింది. నిల్వ కాయ ధర కూడా రూ.18 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.20 వేల వద్ద కొనసాగుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు సాధారణ దినాల్లో రోజుకు 70 లారీల వరకు పచ్చి కాయల ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు దసరా, దీపావళి పండగల సీజన్ మొదలవడంతో ఎగుమతులు మరింత పెరిగాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పచ్చి కాయను మూడు నాలుగు నెలల పాటు నిల్వ చేసుకునే అవకాశముంది. వీటిని కార్తిక మాసం చివరి వరకు వినియోగించుకునే వీలుండటంతో ఈ పండగల సీజన్‌లో పచ్చికాయలకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.
తమిళనాట ధర పెరగడంతో..
ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళనాడు కొబ్బరి ధరను బట్టి ఆంధ్రా కొబ్బరి ధరను నిర్ణయిస్తున్నారు. దక్షిణాది నుంచి ఎగుమతి అయ్యే వాటిలో తమిళనాడు కొబ్బరి కాయ సైజు పెద్దదిగా ఉంటోంది. దీంతో, దాని రేటును బట్టి మిగిలిన రాష్ట్రాల కొబ్బరికి ధర నిర్ణయిస్తున్నారు. తమిళనాడులో గత నెల మొదటి వారంలో కిలో కొబ్బరి సగటు ధర రూ.50 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.56కు పెరిగింది. కిలోకు సగటున రెండున్నర కాయలు లెక్కిస్తే ఒక్కో కాయకు రూ.22 నుంచి రూ.23 వరకు ధర వస్తోంది. దీంతో పాటు తమిళనాడు నుంచి ఎగుమతులు కూడా తగ్గాయి. కోనసీమ కొబ్బరి కాయల ధరలు పెరగడానికి ఈ పరిణామాలు కూడా కారణమయ్యాయి.
నిలకడగా కురిడీ ధరలు
మరోవైపు కురిడీ కొబ్బరి ధరలు నెల రోజులుగా దాదాపు నిలకడగా ఉన్నాయి. సెప్టెంబరు మొదటి వారంతో పోలిస్తే వెయ్యి కాయలకు సుమారు రూ.500 వరకు తగ్గినా పెద్దగా హెచ్చుతగ్గులు కనిపించడం లేదు. ప్రస్తుతం పాత గండేరా వెయ్యి కాయలకు రూ.26,500, గటగట కాయలకు రూ.23,500 చొప్పున ధర పలుకుతోంది. కొత్త గండేరా రూ.25,500, గటగట రూ.22,500గా ఉంది. కొత్త కొబ్బరి (ఎండు కొబ్బరి – తయారీ కొబ్బరి) క్వింటాల్‌కు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు, రెండో రకం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ధర పలుకుతోంది. మొత్తం మీద మార్కెట్లో ధరలు పెరగడం, నిలకడగా ఉండటం కొబ్బరి రైతులకు కాస్త సంతృప్తినిస్తోంది. పండగల సీజన్‌లో పెరుగుతున్నందున ఈ ధరలు మరింత పెరగాలని వారు ఆశిస్తున్నారు.


