కొత్తపేట: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము చేపట్టిన నిరాకరణ దీక్షపై ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) వాపోయారు. పలు డిమాండ్లతో వారు చేపట్టిన నిరవధిక ఆందోళనలో భాగంగా మండలంలోని వీఆర్‌ఏలు స్థానిక పాత తహశీల్దార్ కార్యాలయం వద్ద 14 రోజుల పాటు వివిధ రీతుల్లో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా బుధవారం తాళ్లతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంఘం మండల ప్రధాన కార్యదర్శి పిల్లంగోరు బాలు మాట్లాడుతూ, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జోరువానలో, మండుటెండలో 15 రోజులుగా నిరవధిక నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కె.భీమశంకరం, కోశాధికారి ఎస్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
వివిధ క్రీడల్లో నేడు ఎంపికలు
సాక్షి, అమలాపురం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యాన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధికి సంబంధించి వివిధ క్రీడాంశాల్లో గురువారం ఎంపికలు జరగనున్నాయి. ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు కె.గణేశ్వరరావు, వైఎస్‌ఎస్ ఉషారాణి బుధవారం ఈ వివరాలు తెలిపారు. కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో అండర్–14, అండర్–17 బాలబాలికల రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్), అండర్–14, 17 బాలికల రగ్బీ ఎంపికలు జరుగుతాయి. అంబాజీపేట హైస్కూల్‌లో అండర్–17 బాలికల క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తారు. జిల్లాలోని వ్యాయామోపాధ్యాయులు తమ పాఠశాలల క్రీడాకారులను ఈ ఎంపికల్లో పాల్గొనేలా చూడాలని వారు కోరారు.
శనైశ్చరుని హుండీల
ఆదాయం రూ.9.12 లక్షలు
కొత్తపేట: కొత్తపేట మండలం మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారికి హుండీల ద్వారా రూ.9,12,351 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఈ విషయం తెలిపారు. ఆరు నెలల 7 రోజుల అనంతరం బుధవారం ఉదయం హుండీలను తెరచి, ఆదాయం లెక్కించారు. స్వామి వారి హుండీల ద్వారా రూ.8,11,454, క్షేత్ర పాలకుడు వేణుగో పాలస్వామి వారి హుండీల ద్వారా రూ.47,391, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.53,506 వచ్చాయని సురేష్‌బాబు వివరించారు.
సీఈసీని వెంటనే తొలగించాలి
అమలాపురం టౌన్: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యాన స్థానిక గడియారం స్తంభం సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బుధవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సర్ పేరిట సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తప్పుడు మార్గంలో ఓటర్ల జాబితాలు రూపొందించేందుకు కారకుడైన ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి జంగా గౌతమ్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
వరద రక్షణ చర్యలకు
సమగ్ర ప్రణాళిక
అమలాపురం రూరల్: గోదావరి ఏటిగట్ల కోతను నివారించడంతో పాటు, వరదల సమయంలో నష్టం వాటిల్లకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను, నిపుణులను ఆదేశించారు. ఏటిగట్ల పరిరక్షణపై సీఎస్‌ఐఆర్, పర్యావరణ నిపుణులు రూపొందించిన ప్రాథమిక నివేదికను ఆయన పరిశీలించారు. జిల్లాలో 14 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడ వరద ప్రవాహం, వేగం ఎంత మేరకుంది, ఏటిగట్లపై ఎంత స్థాయిలో ఒత్తిడి పడుతోంది, కోతకు ప్రధాన కారణాలు తదితర అంశాలను విశ్లేషిస్తున్నామని నిపుణులు వివరించారు.


