పింఛనా! వంచనా!! | - | Sakshi
Sakshi News home page

పింఛనా! వంచనా!!

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

సాక్షి అమలాపురం: కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం విధించిన గడువు బుధవారంతో ముగియబోతోంది. దీంతో, వేలాదిగా దరఖాస్తుదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలోని 19 మండలాలు, మూడు పట్టణ ప్రాంతాల పరిధిలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి మొత్తం 31,477 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన అనంతరం ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటి వరకూ జిల్లాలోనే అత్యధికంగా అమలాపురం రూరల్‌ మండలంలో 2,050 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, వృద్ధాప్య పింఛన్లకు అత్యధికంగా 18,690 దరఖాస్తులు వచ్చాయి.

గతంలో అర్హత పొందినా

మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2024 జనవరి వరకూ కొత్త పింఛన్లు అందించింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో గ్రామాల వారీగా 10 నుంచి 30 వరకూ పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టింది. సరిగ్గా అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దరఖాస్తులను పట్టించుకోకపోగా.. ఇప్పటి వరకూ కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదు. ఎన్నికల ముందు నాటికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 18 వేల మందికి పైగా అర్హులున్నట్లు సమాచారం. అయితే, వారి దరఖాస్తులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిందేనని వారికి సూచించింది. దీంతో, తమకు గతంలో వచ్చిన అర్హత ఆధారంగా పింఛన్‌ ఇస్తారా.. లేక మళ్లీ కొత్తగా ఎంపిక ప్రక్రియ మొదలుపెడతారా అనే సందేహం అప్పటి దరఖాస్తుదారుల్లో నెలకొంది. కొందరి వద్దకు స్థానిక రాజకీయ నాయకులు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ దరఖాస్తులపై సంతకాలు తీసుకోవడంతో పాటు ఆధార్‌, రేషన్‌ కార్డు తదితర వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల వేళే ఎందుకు?

కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 27 నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా కొత్తగా సామాజిక భద్రతా పింఛను ఇవ్వలేదు. సరిగ్గా ఇదే సమయంలో ప్రతి నెలా ఇస్తున్న పింఛన్ల సంఖ్య క్రమంగా తగ్గిస్తోంది. అటువంటిది త్వరలో స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెబుతూ.. సరిగ్గా ఇదే తరుణంలో కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరణ హడావుడి మొదలుపెట్టింది. అన్ని దరఖాస్తులూ స్వీకరించి, ఆన్‌లైన్‌ చేసిన తర్వాతే అర్హతలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనినిబట్టి ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి అర్హుల తుది జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో, ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమను మాయ చేస్తోందేమోననే సందేహం పలువురిలో ఉంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్‌ ఇస్తారా.. లేక నిబంధనల పేరుతో కొందరినే ఎంపిక చేస్తారా అనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఎర మాత్రమేనని, ‘స్థానిక’ సంగ్రామం ముగిసిన తరువాత చాలా వరకూ దరఖాస్తులను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొత్త పింఛన్లకు మండలాలు/అర్బన్‌ ప్రాంతాలవారీగా వచ్చిన దరఖాస్తులు

మండలం/ వచ్చిన

అర్బన్‌ ప్రాంతం దరఖాస్తులు

అమలాపురం రూరల్‌ 2,050

రావులపాలెం 1,822

ఆలమూరు 1,708

సఖినేటిపల్లి 1,706

కొత్తపేట 1,681

పి.గన్నవరం 1,673

మలికిపురం 1,633

రాజోలు 1,607

మామిడికుదురు 1,579

రామచంద్రపురం రూరల్‌ 1,543

అయినవిల్లి 1,498

అల్లవరం 1,491

ఐ.పోలవరం 1,475

ఆత్రేయపురం 1,464

ఉప్పలగుప్తం 1,417

కాట్రేనికోన 1,414

అంబాజీపేట 1,289

కె.గంగవరం 1,275

ముమ్మిడివరం 956

రామచంద్రపురం అర్బన్‌ 870

అమలాపురం అర్బన్‌ 776

ముమ్మిడివరం అర్బన్‌ 550

ఫ కొత్త పింఛన్లకు

జిల్లాలో వేలాదిగా దరఖాస్తులు

ఫ ఇప్పటి వరకు

31,477 మంది నుంచి స్వీకరణ

ఫ సచివాలయాలకు పోటెత్తుతున్న జనం

ఫ నేటితో ముగియనున్న గడువు

ఫ ఎన్నికల స్టంట్‌గానే

ప్రజల్లో అనుమానాలు

ఫ చేతికి అందితేనే కానీ

నమ్మలేమంటున్న దరఖాస్తుదారులు

కేటగిరీల వారీగా దరఖాస్తుల వివరాలు

కేటగిరీ వచ్చిన

దరఖాస్తులు

వృద్ధాప్య 18,690

వితంతు 6,199

దివ్యాంగ 4,060

మత్స్యకార 779

చేనేత 555

గీత కార్మికులు 537

డప్పు కళాకారులు 283

చర్మకారులు 267

ఒంటరి మహిళలు 104

ట్రాన్స్‌జెండర్లు 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement