అయినవిల్లి: చవితి మహోత్సవాల్లో భాగంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి దర్శనానికి సోమ, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు పర్యవేక్షణలో పంచామృతాభిషేకం, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీలక్ష్మీ గణపతి హోమం, లక్ష గరిక పూజ, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు సుగంధభరిత పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఏడు గంటలకు పంచహారతులు ఇచ్చారు. స్వామివారిని ముషిక వాహనంపై ఉంచి, ఆలయ మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చవితి మహోత్సవాల సందర్భంగా ఆలయం విద్యుద్దీప కాంతులతో తళుకులీనింది. పుష్పాలంకరణతో ఆలయ ప్రాగణం కొత్త శోభను అద్దుకుంది. ఆలయ వెలుపల మట్టి గణపతిని ప్రతిష్ఠించి, స్వామివారి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


