నేటి నుంచి వీఆర్‌ఏల సమ్మె | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వీఆర్‌ఏల సమ్మె

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

అమలాపురం రూరల్‌: తమ డిమాండ్ల సాధన కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) బుధవారం నుంచి సమ్మె చేయనున్నారు. తమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏలు మంగళవారం నిరసన తెలిపారు. తొలుత అమలాపురంలోని అంబేద్కర్‌ భవన్‌లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం, కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు దారపురెడ్డి వీరభద్రం మాట్లాడుతూ, ఎనిమిదేళ్లుగా తమ కనీస వేతనం ఏమాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఖర్చులకు, తమకు ఇస్తున్న జీతానికి అసలు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. వీఆర్‌ఏలకు తక్షణం పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీగా పని చేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సుబ్బారావుకు బుధవారం నుంచి సమ్మె చేస్తున్నట్లు నోటీసు అందజేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకూ తమ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం అమలాపురం మండల అధ్యక్షుడు మొగలికుదురు లక్ష్మణరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ముగ్గు వేసి నిరసన

అమలాపురం టౌన్‌: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండుతో ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఉద్యోగులు దశల వారీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పాంగణంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్‌ స్టాఫ్‌ నర్సుల అసోసియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.అచ్యుతవల్లి ఆధ్వర్యాన ఉద్యోగులు మంగళవారం ముగ్గులు వేసి నిరసన తెలిపారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని ఆకాంక్షిస్తూ ఇంగ్లిషు అక్షరాలతో ముగ్గులు వేశారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎం.శివకుమారి, సభ్యులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు

పకడ్బందీ ఏర్పాట్లు

అమలాపురం రూరల్‌: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైడియాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 1,19,176 ఎకరాల్లో వరి సాగు జరిగిందని చెప్పారు. ఎకరాకు సగటున 2.70 మెట్రిక్‌ టన్నుల దిగుబడి ఆధారంగా మొత్తం 3,33,413.817 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. ఇందులో స్థానిక వినియోగం 33,387.524 మెట్రిక్‌ టన్నులు కాగా, 3,00,026.293 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్‌–ఎ రకానికి రూ.2,461 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తారన్నారు. వరి కోతలు నవంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు. అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అమలాపురం ఆర్‌డీఓ కె.సరళావతి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కె.బాలకుమారి, జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్‌, సహకార శాఖల అధికారులు ఎం.రామారావు, పి.విజయ్‌ భాస్కర్‌, కె.విశాలాక్షి, హుస్సేన్‌, తూనికలు – కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ శంకర విశ్వేశ్వరరావు, కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ టి.నాగలక్ష్మి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కేశవవర్మ తదితరులతో పాటు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement