అసంతృప్తి ఇంకెంతకాలం? | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తి ఇంకెంతకాలం?

Sep 13 2026 12:24 AM | Updated on Sep 13 2026 12:24 AM

పారిశుధ్యంపై మరింత దిగువకు సర్వే ఫలితం

పద్మావతి సంస్థ వైపే అధికారుల మొగ్గు

ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కొనసాగింపు

రూ.1.3 లక్షలు పోగొట్టుకున్న

గొల్లప్రోలు వీఆర్వో

నగదు బదిలీని ఫ్రీజ్‌ చేసిన సైబర్‌ క్రైం సిబ్బంది

అన్నవరం: ప్రముఖ ఆలయాల్లో పారిశుధ్యం బాగోలేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేని పరిస్థితి దేవదాయ శాఖలో నెలకొంది. తొమ్మిది నెలలుగా 70 శాతం మంది భక్తులు ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఈ కాంట్రాక్టు దక్కించుకున్న పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు కావడం ఆయన ప్రభుత్వ పెద్దలకు కావలసిన వారు కావడమేనని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాలకు తిరుపతికి చెందిన ఆ సంస్థదే కాంట్రాక్టు కావడం గమనార్హం.

రెండేళ్లకు రూ.80 కోట్ల పైమాటే

ఏడు దేవస్థానాలలో పారిశుధ్య కాంట్రాక్ట్‌ విలువ రెండేళ్లకు కలిపి రూ.80 కోట్లు పైమాటే. శ్రీశైలం దేవస్థానంలో ఈ కాంట్రాక్ట్‌ నెలకు రూ.1.10 కోట్లు కాగా, అన్నవరంలో నెలకు రూ.80 లక్షలు. మిగిలిన దేవస్థానాలలో ఆవరణ తక్కువ కనుక రూ.60 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ఉంది.

పాత కాంట్రాక్ట్‌ రూ.49 లక్షలు

అన్నవరం దేవస్థానంలో పాత పారిశుధ్య కాంట్రాక్ట్‌ నెలకు రూ.49 లక్షలు కాగా, పద్మావతి సంస్థకు రూ.31 అదనంగా సుమారు రూ.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.7.5 లక్షలు ఫినాయిల్‌, బ్లీచింగ్‌ తదితర సామగ్రికి, రూ.3.68 లక్షలు మెషీన్ల నిర్వహణకు చెల్లించాల్సి ఉంది. 365 మంది సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం రూ.65 లక్షలు వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టర్‌కు ఈ మొత్తం మీద 4.95 శాతం సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాలి. ఈ మొత్తం నెలకు రూ.80 లక్షలు.

సర్వేల్లో దిగజారిన పారిశుధ్యం

రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన అభిప్రాయ సేకరణలో గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు 67.3 శాతం మంది మాత్రమే పారిశుధ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అది ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు 67.5 శాతం ఉంది. ఈ మూడు నెలల్లో జూలైలో 66 శాతం. ఆగస్టులో 64.9 శాతం మాత్రం భక్తులు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.

పరిస్థితి మెరుగుపరచాలి

వచ్చే నెలలో ప్రారంభమయ్యే దసరా నుంచి వరుసగా పర్వదినాలే. తరువాత కార్తికమాసం ఇలా వరస ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఏసీబీ తనిఖీలని బెదిరింపు కాల్‌

పిఠాపురం: గొల్లప్రోలు వీఆర్వో వెంకటపతిని ఏసీబీ అధికారులమని బెదిరించి రూ.1.3 లక్షలు దోచుకున్న ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే గత సోమవారం ఓ వ్యక్తి 9740562154 నంబరు నుంచి ఫోన్‌ చేసి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుని మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, తనిఖీలకు వస్తున్నామని బెదిరించాడు. తానేమీ అవినీతికి పాల్పడలేదని చెప్పినా వినకుండా పదేపదే ఫోన్లు చేసిన బెదిరించి తమ నంబర్‌కు రూ.2 లక్షలు వేస్తే దాడికి రామని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో వీఆర్వో తన భార్య బంగారాన్ని విక్రయించి వారు చెప్పిన 9493614191 నంబర్‌కు రూ.95 వేలు ఒకసారి, రూ.5 వేలు మరోసారి ఫోన్‌పే చేశాడు. అయినప్పటికీ మిగిలిన సొమ్ము కోసం బెదిరించడంతో మరో రూ.30 వేలు పంపాడు. ఈ విషయాన్ని సహోద్యోగులకు చెప్పగా వారి సూచన మేరకు సదరు నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించిన వెంకటపతి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సైబర్‌ క్రైం సిబ్బంది ద్వారా ఆ సొమ్మును ఫ్రీజ్‌ చేసినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎన్‌ రామకృష్ణ తెలిపారు. వీఆర్వోకు వచ్చిన ఫోన్‌ నంబరును విచారించగా మద్దూరి రాజ్‌కుమార్‌గా గుర్తించారు.

కాగా సోమవారం ఉదయం నుంచి ఆ కార్యాలయంలోని పలువురు అధికారులకు ఇలా బెదిరింపు కాల్స్‌ చేసి సిబ్బంది సమాచారం అడిగారని, దాడి చేస్తున్నట్టు చెప్పగా వాటిని కట్‌ చేసినట్టు పలువురు తెలిపారు. ఇలా తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐకి ఫోన్‌ చేసి వివరాలు అడిగి యథా ప్రకారం బెదిరించగా, ఆధారాలు ఉంటే వచ్చి విచారణ చేసుకోవచ్చని ఆయన బదులివ్వడంతో ఆ కాల్‌ కట్‌ చేశారని, ఇదే విషయంపై సహోద్యోగులకు అవగాహన కల్పిస్తుండగానే వీఆర్వో వారి వలకు చిక్కినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement