తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో చొల్లంగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డు వెంకటేశ్వరరావు (50) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, అతని కుమారుడు బొడ్డు తబన్‌బాబులు ఆటోలో మట్లపాలెం వెళుతుండగా, యానాం వైపు నుంచి అతి వేగంగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ నాగబాబు, తబన్‌బాబులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భట్నవిల్లిలో కారు బోల్తా
పశ్చిమగోదావరి వాసులకు స్వల్ప గాయాలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి కాకినాడ వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక వనువులమ్మ గుడిసెంటర్ వద్ద టర్నింగ్ పాయింట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికుల సురక్షితంగా బయట తీశారు. వారికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తాలూకా ఎస్సై చైతన్యకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రైవేటు బస్సులపై దాడులు
అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు శనివారం ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేశారు. 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.40,800 అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు సురేష్ కుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు.
మందుల లోడు లారీలో
అగ్నిప్రమాదం
తుని రూరల్: విశాఖపట్నానికి గూడ్స్ లారీలో తరలిస్తున్న మందులు లోడులో అగ్ని ప్రమాదం సంభవించడంతో రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లినట్టు ఇన్‌చార్జి అగ్నిమాపక అధికారి కె.భాస్కరరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రైవేట్ గూడ్స్ లారీలో మందులు తరలిస్తుండగా తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందన్నారు. వాహనం వేగంగా వెళ్తుంతుండగా మందులు ఒకదానితో మరోకటి రాపిడికి గురై మంటలు వ్యాపించినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదన్నారు. నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ తెలిపారు.


