మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామంటున్నారు పర్యావరణ వేత్తలు. పర్యావరణ స్పృహతో అడుగులు వేస్తూ, రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని, నీటిని కానుకగా ఇవ్వడమే మనం ఆ విఘ్నేశ్వరునికి సమర్పించే నిజమైన నైవేద్యమని చెబుతున్నారు. రసాయన కవచాలు, ప్రాణాంతక కృత్రిమ రంగుల వినియోగం ద్వారా మన జీవనాధారమైన జలవనరులను విషతుల్యం చేయొద్దని కోరుతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఇదే లక్ష్యంతో మట్టి గణపతి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ స్వచ్ఛంద సంస్థలు తమవంతు కృషి చేస్తున్నాయి.
సాక్షి, అమలాపురం: వినాయక చవితి సందడి మొదలైంది. పండగ వేళ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ పైనా ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలనే పూజించాలన్న సందేశం జిల్లాలో విస్తరిస్తోంది. పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు ఏటా చేపడుతున్న ప్రచారంతో మట్టి గణపతులకు డిమాండ్ పెరుగుతోంది.
పీఓపీ విగ్రహాలతో జల కాలుష్యం..
పీఓపీ విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో నిమజ్జనం తర్వాత చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల్లో వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. వీటికి వేసే రసాయన రంగులు నీటిలో కలవడంతో జలకాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. నీటి నాణ్యత దెబ్బతినడంతో చేపలు, ఇతర జలచరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిమజ్జనం అనంతరం ఒడ్డుకు చేరే పీఓపీ అవశేషాలను తొలగించడం స్థానిక సంస్థలకు అదనపు భారంగా మారుతోంది. కోనసీమ జిల్లా పరిధిలో డెల్టా పంట కాలువల్లో కూడా వీటిని కలిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది.
మట్టి విగ్రహాలకు పెరుగుతున్న ఆదరణ
ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మట్టి విగ్రహాల తయారీకి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం గాడిలంకతో పాటు పలు ప్రాంతాల్లో స్థానిక కళాకారులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన మట్టితో తయారు చేయడంతో నిమజ్జనం అనంతరం విగ్రహం కరిగి మట్టిలో కలిసిపోయే అవకాశం ఉండటంతో పర్యావరణహిత ఎంపికగా వీటిని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు పీఓపీతో తయారయ్యే భారీ విగ్రహాలను ఎక్కువగా పందిళ్లలోనే ప్రతిష్ఠిస్తున్నారు. పెద్ద విగ్రహాల తయారీలో పీఓపీతో పాటు రసాయన రంగుల వినియోగం అధికంగా ఉండటంతో పర్యావరణంపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. మట్టి గణపతులపై అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. గతంలో మట్టి విగ్రహాల తయారీ, పంపిణీకి పరిమితమైన కార్యక్రమాలు ఇప్పుడు ప్రత్యేక క్యాంపెయిన్లుగా మారుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలంటే మట్టి గణపతిని పూజించడమే ఉత్తమ మార్గమంటూ ప్రజలకు సందేశం ఇస్తున్నారు.
66 ఏళ్లుగా మట్టి గణపతికే పూజలు
రామచంద్రపురం దఫెదార్ సెంటరులో శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయ బాల భక్త సమాజంలో 66 ఏళ్లుగా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహానికే భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2010లో అప్పటి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ చేతుల మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ అవార్డు అందుకున్నారు.
మట్టి విగ్రహాలకు పెరుగుతున్న డిమాండ్
కోనసీమలో విస్తరిస్తున్న పర్యావరణ హితం
మట్టి వినాయకుడినే
పూజిద్దామంటున్న స్వచ్ఛంద సంస్థలు
సోషల్ మీడియాలో ప్రత్యేక క్యాంపెయిన్
పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి పెను ముప్పు


