ప్రయాణికుల భద్రతపై
ఆందోళన?
కొవ్వూరు – చాగల్లు మధ్య రైల్వే ట్రాక్‌లు, పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు వంటి వాటిపై రైల్వే ఉన్నతాధికారుల ప్రత్యేక తనిఖీలు తూతూమాత్రంగానే ఉంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ స్టేషన్ల మధ్య తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన సమయంలో పక్క ట్రాక్‌లో ప్రయాణికుల రైలు ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి ఘటనలను కూడా రైల్వే అధికారులు తేలికగా తీసుకోరాదు. చిన్న సాంకేతిక లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత కారణాలు వెతకడం కంటే.. ప్రతి డీరైల్‌మెంట్‌పై సాంకేతికంగా సమగ్ర విచారణ జరిపి, ముందుగానే లోపాలను గుర్తించి, శాశ్వత ప్రాతిపదికన సరి చేయడం అత్యవసరంగా కనిపిస్తోంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడవచ్చని ప్రయాణికులు సూచిస్తున్నారు.
చాగల్లు: విజయవాడ – విశాఖపట్నం రైల్వే మార్గంలో వేలాది మంది ప్రయాణికులు నిత్యం అనేక రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. తూర్పు తీరంలో అత్యంత కీలకమైన రైల్వే లైను ఇది. ఈ మార్గంలోని కొవ్వూరు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల తరచుగా గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పుతూండటంతో (డీరైల్) ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. గత ఫిబ్రవరి 12న విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు చాగల్లు రైల్వే స్టేషన్ సమీపాన పట్టాలు తప్పింది. గత నెల 31న విశాఖపట్నం సమీపంలోని సింహాచలం నుంచి విజయవాడ వద్ద ఉన్న కొండపల్లికి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఓ వ్యాగన్.. కొవ్వూరు రైల్వే స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్‌ఫారం చివరన ఉన్న నాలుగో లైన్‌లో (లూప్‌లైన్) పట్టాలు తప్పింది. తాజాగా శుక్రవారం ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి మహారాష్ట్రలోని బారామతికి ఎరువులను రవాణా చేస్తున్న గూడ్స్ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్ ఔటర్‌లో పట్టాలు తప్పింది. మొత్తం 47 వ్యాగన్లకు గాను ఎనిమిది పట్టాలు తప్పాయి. మూడు సందర్భాల్లోనూ గూడ్స్ రైళ్లే పట్టాలు తప్పినప్పటికీ... కొవ్వూరు – చాగల్లు మధ్య జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇక్కడి ట్రాక్‌ల నిర్వహణ, రైల్వే పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, వేగ నియంత్రణ తదితర సాంకేతిక అంశాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండే విజయవాడ – విశాఖపట్నం మార్గంలో రైల్వే ట్రాక్‌లపై నిరంతరం సమగ్ర పరిశీలన అవసరమనే విషయాన్ని ఈ ప్రమాదాలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రయాణికులకు అవస్థలు
ఫ తరచుగా డీరైల్ అవుతున్న గూడ్స్ రైళ్లు
ఫ కొవ్వూరు – చాగల్లు స్టేషన్ల మధ్య వరుస ప్రమాదాలు
ఫ ఆరు నెలల్లోనే మూడు ఘటనలు
ఫ భద్రతపై ప్రయాణికుల ఆందోళన
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్‌లో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలు సజావుగా సాగేంత వరకూ ఈ హెల్ప్ డెస్క్ కొనసాగుతుందని రైల్వే సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు.
పెరవలి/రాజమహేంద్రవరం సిటీ: కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో విజయవాడ – విశాఖపట్నం మధ్య ఇరువైపులా పలు రైళ్లు 2 నుంచి 6 గంటల మేర ఆలస్యంగా నడిచాయి. రాజమండ్రి, సామర్లకోట, నిడదవోలు జంక్షన్ తదితర స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు పడ్డారు. విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్, ప్రశాంతి, బొకారో, తిరుమల, సింహాద్రి, వందేభారత్, కోణార్క్, జన్మభూమి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బొకారో, శేషాద్రి, తిరుమల, వందేభారత్ రైళ్లు సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచాయి. కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్‌ప్రెస్ 5 గంటలు, తిరుపతి ఎక్స్‌ప్రెస్ 4 నాలుగు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాయి. రైళ్లు ఆలస్యంగా నడవడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు రద్దీగా మారాయి. కూర్చునేందుకు బెంచీలు సైతం చాలక వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్ల రాకపోకలపై అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు రైళ్ల రద్దు: విశాఖపట్నం – విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ – రాజమండ్రి – విజయవాడ (67202/67201) రైళ్లను అధికారులు శుక్రవారం రద్దు చేశారు. విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(12718)ను శనివారం రద్దు చేశారు.
హుటాహుటిన ట్రాక్ పునరుద్ధరణ పనులు
ౖరైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల నుంచి ఎరువులు కిందకు దింపి, మరమ్మతులు చేపట్టారు. సుమారు నాలుగు గంటల తరువాత ట్రాక్ సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, ప్రమాద స్థలానికి మీడియాను వెళ్లనివ్వకుండా రైల్వే అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.


