అమలాపురం టౌన్: బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ఒక రోజు సమ్మె చేపట్టారు. కోనసీమలోని బ్యాంక్‌లకు చెందిన దాదాపు 500 మంది అధికారులు, ఉద్యోగులు అమలాపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచికి చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి గడియారం స్తంభం సెంటరు వరకు ప్లకార్డులు చేతబూని నిరసన ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సమస్యపై 2026 జనవరి 27న తాము సమ్మె నిర్వహించిన క్రమంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడాన్ని వారు గుర్తు చేశారు. ఆ హామీ అమలు కాకపోవడంతో యూఎఫ్‌బీయూ మరోసారి సమ్మెకు దిగాల్సి వచ్చిందని బ్యాంక్‌ల యూనియన్ల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ సురేష్‌కుమార్ కానూరి, యూనియన్ జోనల్ సెక్రటరీ గణేష్, పలు బ్యాంక్‌ల యూనియన్ల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, టీవీ సత్యనారాయణ, వైఎల్ ప్రసాద్, దుర్గారామ్ తదితరులు నాయకత్వం వహించారు.
హడలెత్తిస్తున్న బెబ్బులి
మరోసారి రాజవొమ్మంగి అడవుల్లోకి రాక
రాజవొమ్మంగి: ప్రజలను హడలెత్తిస్తున్న పులి మరో మారు రాజవొమ్మంగి అడవుల్లోకి వచ్చింది. గురువారం ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్‌లోని ఉలిగోగులపాడు పరిసర అటవీ ప్రాంతంలో సంచరించగా, అదే రోజు రాత్రి రాజవొమ్మంగి అడవుల వైపు వచ్చినట్లు సమాచారం. రాజవొమ్మంగి ఫారెస్టు రేంజ్ వాతంగి పరిసర అడవికి పులి వచ్చినట్లు రేడియో కాలర్ ద్వారా తెలిసిందని రాజవొమ్మంగి రేంజ్ ఆఫీసర్ ఉషారాణి శుక్రవారం విలేకరులకు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం రాజవొమ్మంగి అటవీ క్షేత్రంలో హల్‌చల్ చేసి, అనేక పశువులను చంపి, జిల్లా దాటి వెళ్లిపోయిన పులి తిరిగి ఇదే ప్రాంతానికి మరోసారి రావడంతో వాతంగి పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగా వాతంగి, కొమరాపురం, ఓగిపాలెం, లోదొడ్డి, ఓకుర్తి, బట్టావారివీధి, పెద రెల్లంగిపాడు రిజర్వు ఫారెస్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను మేతకు అడవుల్లోకి విడిచిపెట్టవద్దని, రాత్రి పూట ఒంటరిగా తిరగవద్దని రేంజ్ ఆఫీసర్ ఉషారాణి గిరిజనులకు సూచించారు. రాత్రి వేళల్లో ఇళ్లలో లైట్లు వేసి ఉంచాలని కోరారు. తమ సిబ్బంది ఆయా గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని దండోరా వేస్తున్నారని తెలిపారు.
ఆవెల్తి గ్రామంలో ఆవులపై పులి దాడి!
శంఖవరం: మండలంలోని అవెల్తి గ్రామంలో శుక్రవారం రాత్రి పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా మరో ఆవు గాయపడిందని గిరిజనులు తెలిపారు. గ్రామ శివారులో రెండు పశువులపై పులి దాడి చేయగా, ఒక ఆవు మృతి చెందిందని, మరో ఆవు గాయాలతో ఇంటికి వచ్చిందన్నారు. రాత్రి సమయం కావడంతో ఘటనా స్ధలానికి వెళ్లడం వీలుకాక, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించిన అనంతరం పులి దాడి చేసిందా, మరేదైనా జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.


