● జిల్లాలో అప్పుడే మొదలైన
ఎన్నికల సందడి
● బలాబలాల అంచనాలు,
సమీకరణాలతో వేడెక్కుతున్న రాజకీయం
ఎన్నికల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.. రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు.. పొత్తులపై రాజకీయ పక్షాల్లోనూ తుది నిర్ణయం తీసుకోలేదు.. అయినా కోనసీమలో మాత్రం స్థానిక ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. పట్టణంలో పుర పోరుకు.. పల్లెల్లో పంచాయతీ పోరుకు.. మండల, జిల్లా పరిషత్‌లకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతుండగా.. రాజకీయ పక్షాలు మాత్రం గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి.
సాక్షి, అమలాపురం: జిల్లాలో ఓటర్ల జాబితాల పరిశీలన నుంచి సామాజిక వర్గాల విభజన వరకు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల వరకు అధికార యంత్రాంగం కసరత్తు వేగం పెంచింది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఆశావహుల అన్వేషణ, స్థానిక బలాబలాల అంచనాలతో క్షేత్రస్థాయిలో సమీకరణలకు పదును పెడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే కోనసీమలో స్థానిక రాజకీయం వేడెక్కుతోంది.
పుర పోరుకు 91 వార్డులు
జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి 91 వార్డులు ఉన్నాయి. అమలాపురంలో 36, రామచంద్రపురంలో 32, ముమ్మిడివరంలో 23 వార్డులు ఉన్నాయి. గతంతో పోలిస్తే కొత్తగా 11 వార్డులు పెరిగాయి. మూడు పట్టణాల్లో కలిపి 97,157 మంది ఓటర్లు ఉండగా, 130 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అమలాపురంలో 41,079 మంది ఓటర్లు ఉన్నారు. రామచంద్రపురంలో 34,850 మంది, ముమ్మిడివరంలో 21,228 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
రిజర్వేషన్లకు సామాజిక లెక్కలు
పురపాలక ఎన్నికల నేపథ్యంలో సామాజిక వర్గాలవారీగా ఓటర్ల విభజనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 8 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టారు. ఇది 12వ తేదీకి ముగియనుంది. పుర పోరు రిజర్వేషన్ల ఖరారుకు ఈ ప్రక్రియ కీలకం కానుంది.
వైఎస్సార్‌సీపీ దూకుడు..
కూటమిలో అయోమయం
అధికార యంత్రాంగం ఎన్నికల సన్నాహాల్లో ఉండగానే రాజకీయ పార్టీల్లోనూ కదలిక మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆత్మవిశ్వాసంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రావులపాలెం సీఆర్సీలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. వార్డు స్థాయి నుంచి జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వరకు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మరోవైపు అధికార కూటమి పార్టీల్లో మాత్రం స్థానిక ఎన్నికల సన్నాహాలపై అంతర్గతంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే.. పొత్తులపై స్పష్టత రాకముందే పోటీకి తామే సిద్ధమంటూ ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
పరిషత్ పోరుకూ సన్నాహాలు
గ్రామీణ ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికలకు అవసరమైన కసరత్తు కూడా సాగుతోంది. జిల్లాలోని 19 మండలాల్లో 19 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 379 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల పరిస్థితి, సామాజిక వర్గాల లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో బీసీ ఓటర్లు 4,12,566 మంది, ఓసీలు 3,71,494 మంది, ఎస్సీలు 2,99,658 మంది, ఎస్టీలు 7,317 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో సుమారు 10.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సామాజిక సమీకరణాలు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్ల ఖరారులో కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
పల్లె పోరుకూ ఏర్పాట్లు
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 342 పంచాయతీలు, 3,878 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు నాలుగు వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఎన్నికల సిబ్బంది తదితర అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. నెలాఖరు నాటికి ప్రధాన కసరత్తును పూర్తి చేసే దిశగా యంత్రాంగం ముందుకు సాగుతోంది.


