ప్రచారం మిన్న.. నిధులు సున్నా.. | - | Sakshi
Sakshi News home page

ప్రచారం మిన్న.. నిధులు సున్నా..

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

వచ్చే ఏడాది జూన్‌లో పుష్కరాలు

ఆరు జిల్లాల్లో రూ.8 వేల కోట్లతో ప్రతిపాదనలు

నేటికీ నయాపైసా విడుదల

చేయని సర్కారు

మంజూరుపై స్పష్టత కరువు

నేటికీ ప్రారంభం కాని టెండర్ల ప్రక్రియ

గడువు సమీపిస్తున్నా

స్పందించని ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి మహా పుష్కరాలంటూ గతంలో మాదిరిగానే ప్రచారం ఊదరగొడుతున్నారు. కుంభమేళా తరహాలో నిర్వహిస్తామంటున్నారు. రూ.కోట్లు వెచ్చిస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు సర్కారు పెద్దల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదు. పుష్కరాలకు ఇక పది నెలల సమయం మాత్రమే ఉంది. అభివృద్ధి పనులకు మాత్రం ప్రభుత్వం నయాపైసా నిధులు కూడా ఇవ్వడం లేదు. పరిస్థితి చూస్తే పుష్కరాలు సవ్యంగా జరిగేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రూ.8 వేల కోట్లతో..

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేసింది. పుష్కర ఏర్పాట్లలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో 102, కోనసీమలో 175, కాకినాడలో 6. పశ్చిమ గోదావరిలో 40, ఏలూరు జిల్లాలో 36 చొప్పున ఘాట్లను అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటు వివిధ అభివృద్ధి పనులకు అధికారులు ఏడాది కిందట రూ.8 వేల కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటిని ఆమోదించారా.. తిరస్కరించారా.. అసలు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. దీంతో, ఘాట్ల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. పుష్కరాలకు వచ్చే కోట్ల మంది భక్తుల వాహనాలు ఎక్కడ పార్క్‌ చేయాలి.. ఏ ఘాట్లలో స్నానాలు ఆచరించాలి.. భద్రతా పరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలనే అంశాలపై అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు చర్చలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

ప్రతిపాదనలు, సమీక్షలతో సరి

పుష్కరాలకు ప్రధాన కేంద్రంగా అందరూ భావించే తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పనులు చేపట్టేందుకు అధికారులు తొలి దశలో రూ.1,578 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో వివిధ పనులకు రూ.2,105.96 కోట్లతో ఏడాది క్రితం రెండోసారి ప్రతిపాదనలు అందజేశారు. వాటి పైనా ప్రభుత్వం స్పందించలేదు. పుష్కరాలకు సంబంధించి ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆ సందర్భంగా చేపట్టాల్సిన పనుల జాబితాను ఆయనకు అధికారులు అందించారు. నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మాత్రం సీఎం చెప్పారే తప్ప నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల చేస్తానన్న చంద్రబాబు ప్రకటన గాల్లో కలిసిపోయింది. ఆ నిధులు ఎవరికి కేటాయించారో తెలియని పరిస్థితి. పుష్కరాల ఖర్చు భారాన్ని కేంద్రంపై నెట్టేసి, తప్పించుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు అవసరమంటూ ప్రతిపాదనలు పంపింది. అయితే, ఈ నిధుల విడుదలపై కేంద్రం సైతం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దీంతో పుష్కర నిధులపై సందిగ్ధత నెలకొంది.

రాజమహేంద్రిలో నత్తనడకన..

గోదావరి పుష్కరాలంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది రాజమహేంద్రవరం. భక్తులు అత్యధికంగా పుష్కర స్నానాలు ఆచరించే పుష్కర, కోటిలింగాల ఘాట్లు కొలువైన ప్రాంతం. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఈ నగరంలో అభివృద్ధి పనులు నత్త కంటే నెమ్మదిగా సాగుతున్నాయి. మున్సిపల్‌ సాధారణ నిధులు మినహా.. పుష్కర నిధులు నయాపైసా కూడా వెచ్చించిన దాఖలాల్లేవు. నగరంలో 26 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా.. ఏడింటిని మాత్రమే విస్తరించే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సైతం నిధుల కొరత వేధిస్తోంది.

అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో రూ.94 కోట్ల పర్యాటక శాఖ నిధులతో రివర్‌ ఫ్రంట్‌, పుష్కర ఘాట్‌ అభివృద్ధి, హేవలాక్‌ బ్రిడ్జి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం నగరంలో ఒక్క పుష్కర ఘాట్‌ తప్ప ఏ ఇతర ఘాట్లలోనూ అభివృద్ధి పనులు చేపట్టలేదు.

ఇరిగేషన్‌ శాఖ ద్వారా రూ.210 కోట్ల వ్యయంతో ఆరు జిల్లాల పరిధిలో 11,616 పనులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా గోదావరి తీరంలోని పాత స్నాన ఘాట్ల మరమ్మతులకు నిధులు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. పనులు మాత్రం నేటికీ కార్యరూపం దాల్చిన దాఖలాల్లేవు. ఘాట్లన్నీ అపరిశుభ్రంగానే ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదిలించకపోవడంతో విద్యుత్‌ శాఖ రూ.150 కోట్లు, దేవదాయ శాఖ రూ.25 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశాయి.

పది నెలల్లో సాధ్యమేనా?

పుష్కరాలకు గడువు పది నెలలు మాత్రమే ఉండటంతో ఆలోగా అభివృద్ధి, మౌలిక వసతుల పనులు శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రధానంగా ఘాట్ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో గడువులోగా ఈ పనులు పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నెల లేదా వచ్చే నెలలో పనులు ప్రారంభించినా.. తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం సాధ్యం కాదని పలువురు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. చివరిలో హడావుడిగా పనులు చేపట్టి, వచ్చిన నిధులు మింగేసేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement