● 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశం
● పటిష్ట బందోబస్తు ● 14 నుంచి ఉత్సవాలు ప్రారంభం
● 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
అయినవిల్లి: వినాయక చవితిని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ రోజున సుమారు 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద చలువ పందిళ్ల నిర్మాణం, విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు. చవితి తొమ్మిది రోజుల పాటు మట్టి గణపతికి పూజలు నిర్వహించేందుకు ఆలయం ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చవితి మహోత్సవాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా స్వామివారి దర్శనాలు కొనసాగనున్నాయి. భక్తులందరికీ ఉచిత దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అత్యధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి సుమారు 3 వేల మంది వేచి ఉండేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించి, ప్రవేశం, దర్శనం, బయటకు పోవు మార్గాలను పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టనుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేందుకు ప్రభుత్వ వైద్య సిబ్బందిని, ప్రథమ చికిత్స సౌకర్యాలను సిద్ధంగా ఉంచనున్నారు. రెవెన్యూ, పోలీసు, మెడికల్, పంచాయతీ, దేవస్థాన పరిపాలన, సెక్యూరిటీ సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్థానిక యువత సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.


