ఓ మై డాగు | - | Sakshi
Sakshi News home page

ఓ మై డాగు

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

సాక్షి, అమలాపురం: ఒకప్పుడు పనికిరాదని పక్కన పడేసిన కుళ్లిన (డాగు) కొబ్బరి కాయకే ఇప్పుడు బంగారంలాటి ధర పలుకుతోంది. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోని గంగా ఘాట్లలో దహన సంస్కారాలకు, గంగార్పణాలకు దీనికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీంతో, కోనసీమ నుంచి డాగు కొబ్బరి నేరుగా ఉత్తరాదికి తరలిపోతోంది. ఫలితంగా కొబ్బరికి పుట్టినిల్లయిన అంబాజీపేటలోనే డాగు కొబ్బరి కనిపించని పరిస్థితి ఏర్పడింది. లేదు.

‘డాగు’ ఎందుకొస్తుందంటే..

జిల్లావ్యాప్తంగా కొబ్బరి వ్యాపారానికి గడ్డుకాలం వచ్చింది. గతంలో దెబ్బ తిన్న (కుళ్లిన – డాగు పడిన) కొబ్బరిని స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేసేవారు. రైతులు కొబ్బరి కాయను ఒలిచి కురిడీగా తయారు చేసేందుకు అటకల మీద, ప్యాక్‌ హౌస్‌లలో నిల్వ చేస్తారు. మార్కెట్లో ధర లేనప్పుడు కొబ్బరి కాయను నేరుగా నిల్వ చేస్తూంటారు. ఈ క్రమంలో లేత కాయలతో పాటు కొన్ని కాయలు కుళ్లిపోతాయి. దీనినే స్థానికంగా డాగు పడటమని అంటారు. ఈ డాగు కొబ్బరిని స్థానిక చిరు వ్యాపారులు కొనుగోలు చేసి, తొక్క తీసి, నూనె తయారు చేసేవారు. దీన్ని డాగు నూనె అంటారు. ఇది దీపాలు వెలిగించేందుకు, సబ్బుల తయారీ, ఇతర పరిశ్రమల్లో వినియోగిస్తూంటారు.

ఉత్తరాదిలో డిమాండ్‌

ఉత్తరాది రాష్ట్రాల్లో మరణించిన తమవారి దహన సంస్కారాలకు డాగు కొబ్బరిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌లోని గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వహించే అంత్యక్రియల సందర్భంగా ఈ కుళ్లిన కొబ్బరిని వినియోగించడం ఆనవాయితీగా మారింది. దీంతో, ఆయా రాష్ట్రాలకు కుళ్లిన కొబ్బరి కాయలు నేరుగా ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్నంటడంతో కురిడీ కొబ్బరి ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కురిడీ కాయల ధర రూ.21 వేల నుంచి రూ.24,500 వరకూ పలుకుతోంది. దీంతో, ఉత్తరాదిలోని ఆలయాల్లో, ముఖ్యంగా గంగార్పణం వంటి కార్యక్రమాల్లో సామాన్యులు, పేదలు తక్కువ ధరకే దొరికే ఈ డాగు కొబ్బరిని కురిడీ కొబ్బరికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కూడా దీనికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటక నుంచి కూడా డాగు కొబ్బరికి పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తోంది. అయితే, అక్కడ తయారవుతున్న డాగు నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు ఇక్కడి నుంచి పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు.

స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం

డాగు కొబ్బరి ఉత్తరాదికి తరలిపోవడం స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోనసీమ జిల్లా అంతటా డాగు కొబ్బరి వ్యాపారం జరుగుతున్నా, పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లోని ముంజవరం, పొత్తాయలంక వంటి ప్రాంతాల్లో ఇది ఒక కుటీర పరిశ్రమలా ఉంది. సుమారు 300 కుటుంబాల వారు ప్రత్యక్షంగా, వెయ్యి కుటుంబాలు పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కాయ దొరకక వీరికి ఉపాధి లేకుండా పోయింది. ఒకప్పుడు అంబాజీపేట కేంద్రంగా కొబ్బరి నూనెకు జాతీయ స్థాయిలో బ్రాండ్‌ ఉండేది. కల్తీ నూనెల వల్ల ఆ పరిశ్రమ దెబ్బ తిని, పదో వంతుకు పడిపోయినా, డాగు నూనె మాత్రం ఎంతో కొంత నిలబడింది. ఇప్పుడు డాగు కొబ్బరి కాయలు నేరుగా ఉత్తరాదికి తరలిపోతూండటంతో స్థానికంగా ముడిసరుకు లేక నూనె ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో, ఉన్న నాలుగైదు మిల్లులు కూడా మూతపడే పరిస్థితి నెలకొందని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబాజీపేట మార్కెట్లో

దొరకని డాగు కొబ్బరి

ఉత్తరాదికి నేరుగా ఎగుమతి

గతంలో వంద కాయల ధర రూ.85

నేడు రూ.800కు పెరుగుదల

స్థానికంగా నిలిచిన నూనె ఉత్పత్తి

పాలకొల్లు నుంచి కోనసీమ వరకూ..

డాగు కొబ్బరి ఎగుమతులు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మొదలయ్యాయి. ఇప్పుడు కోనసీమ జిల్లా నుంచే నేరుగా, జోరుగా ఎగుమతులు జరుగుతున్నాయి. ధరల విషయానికి వస్తే గతంలో వంద డాగు కాయల ధర రూ.25 నుంచి రూ.85 మాత్రమే ఉండేది. అంటే కాయకు పావలా నుంచి 85 పైసల వరకూ ధర వచ్చేది. ఇప్పుడు అదే వంద కాయల ధర రూ.500 నుంచి రూ.800కు ఎగబాకింది. ఇందులో రెండో రకమైన ఖచ్చం రకం కాయ ధర అయితే ఏకంగా రూ.950 వరకూ పలుకుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement