● కూటమి ప్రభుత్వం హక్కులను
కాలరాస్తోంది
● పి.గన్నవరం కో ఆర్డినేటర్
గన్నవరపు శ్రీనివాసరావు
అయినవిల్లి/అంబాజీపేట: అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు బుధవారం తెల్లవారుజామున హౌస్ అరెస్టు చేశారు. ఆ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లి మండలం తొత్తరమూడిలోని ఆయన నివాసంలోను, గంగలకుర్రు అగ్రహారంలో అంబాజీపేట మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్‌ను, మాచవరంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్‌ను వారి నివాసాల్లో హౌస్ అరెస్టు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందించేందుకు సిద్ధమవుతున్న తమను హౌస్ అరెస్టు చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. గన్నవరపు శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును శాంతియుత వాతావరణంలో తాము కలుస్తామని అంటే అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు తమకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. నాలుగు మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షులను హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రయత్నించడం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును, ఆయన జ్ఞాపకాలను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్నో ప్రభుత్వ భూములుండగా, వైఎస్సార్ వ్యవసాయ క్షేత్రంలోనే ఆ పార్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. యువతకు ఇస్తానన్న 20 వేల ఉద్యోగాలు ఏవని శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుడుపూడి విద్యాసాగర్, మండల శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసబాబు, నాయకుడు చిలువూరి సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.


