● నిరుద్యోగ యువతపై వేధింపులు ఆపాలి
● పోలీసు శాఖలో ఖాళీ
పోస్టులను భర్తీ చేయాలి
● డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
రామన్న డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో పాటు శ్యామ్ సంస్థపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన, డీవైఎఫ్‌ఐ నాయకుడు టి.రాజా అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్‌లో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వెంటనే అక్రమ కేసులు ఉపసహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతపై పోలీసు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, అందులో భాగంగానే కాకినాడ కొండయ్యపాలెం బ్రిడ్జి నుంచి సోమవారం శాంతియుతంగా ప్రదర్శన చేసుకుంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. హోంమంత్రి విడుదల చేసిన వీడియోలో అబద్ధాలు చెప్పారని అన్నారు. తొలుత 20 మంది నిరుద్యోగ అభ్యర్థులపై కేసులు పెట్టారని, తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారని అన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహ కార్యదర్శి వై.బాబీ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ, నిరుద్యోగులకు మద్దతుగా వెళ్లిన డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో పాటు శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్‌పై కాకినాడ త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసులు బనాయించడం అన్యాయమని అన్నారు. ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ కొద్ది రోజులుగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. తక్షణమే పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు జి.ప్రభాకర్‌వర్మ మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని అన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ కిశోర్ కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.


