అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్‌కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైల్వే లైన్‌ను తొందరగా పూర్తి చేసి, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సప్పా నాగేశ్వరరావు, ఎరగర్త వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు.
సీఎంకు పోస్టుకార్డులు
పంపిస్తూ నిరసన
అమలాపురం టౌన్: తమ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. దశల వారీ ఆందోళనలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వీరు సీఎంకు పోస్టు చేస్తున్న కార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ ఆందోళనలు చేపడుతున్నామని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.అచ్యుతవల్లి తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ అంబాజీపేట మండల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.శివకుమారి, ప్రతినిధులు లోవదేవి, సత్యవతి, దుర్గ, రజని తదితరులు పాల్గొన్నారు.
ఆర్య మరింతగా రాణించాలి
అల్లవరం: తిరుపతిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన తాడి ఆర్య మరింతగా రాణించాలని మాజీ సర్పంచ్ సాధనాల వెంకటరావు ఆకాంక్షించారు. ఆర్య ప్రస్తుతం దేవగుప్తం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అమరావతి చాంపియన్‌షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 60 కేజీల విభాగంలో 137 కిలోల బరువు ఎత్తడం ద్వారా ద్వితీయ స్థానంలో నిలిచి, రజత పతకం సాధించాడు. అంతకు ముందు ఆర్య విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తృతీయ, అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించాడు. తమ పాఠశాల నుంచి రెండు పర్యాయాలు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన ఆర్యను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ అధ్యక్షతన పాఠశాలలో బుధవారం ఘనంగా సన్మానించారు. వెంకటరావు మాట్లాడుతూ, ఆర్య ఒలింపిక్ క్రీడల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి, రాణించాలని అన్నారు. ఆర్య రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడంలో ప్రోత్సాహం అందించిన పీడీ రాజ్‌కుమార్‌ను, తల్లిదండ్రులు జానకి, ఏడుకొండలును ఉపాధ్యాయులు, గ్రామస్తులు సత్కరించారు.


