● ఇదే ఫార్ములాతో స్థానిక ఎన్నికలకు
● వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
● రెండున్నరేళ్ల తరువాత జగన్
ముఖ్యమంత్రి కావడం ఖాయం
● ఈసారి కార్యకర్తలకు ఎనలేని గుర్తింపు
● వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి
సమావేశంలో పార్టీ రీజనల్
కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ
సాక్షి, అమలాపురం/ కొత్తపేట/ రావులపాలెం/ ఉప్పలగుప్తం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు గానీ.. ఎన్నికలంటూ జరిగితే మాత్రం వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఫార్ములాతో వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు వెళుతోందని ఆయన వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం రావులపాలెంలో జరిగింది. కోనసీమ జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు మనమందరం బాధ్యత తీసుకోవాలన్నారు.
నాడు టీడీపీ పోటీకి కూడా రాలేదు
చంద్రబాబు చాలా జిత్తులమారి.. అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. రెండున్నరేళ్ల తరువాత జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఎనలేని గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ పోటీకి కూడా రాలేదని, లేనిపోని ఆరోపణలు చేసి ఎన్నికలకు దూరంగా ఉందని ఆయన చెప్పారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుడి స్థాయి నుంచి ప్రతి పదవికీ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ ఉంటుందని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ మాత్రమే అని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఐడెంటిటీ కార్డు అనేది గుర్తింపు కాదని, అది మన గౌరవం కోసం ఇస్తున్న కార్డని ప్రకటించారు. పార్టీ ఐడీ కార్డులను లాంఛనంగా ప్రారంభించారు. వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన పోస్టరును కూడా ఈ సందర్భంగా ఆవిస్కరించారు. పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి గొల్లపలి సూర్యారావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ స్థానిక సంస్థల నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్, కర్రి నాగిరెడ్డి, కటకంశెట్టి ఆదిత్య కుమార్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, దంగేటి రాంబాబు, వంటెద్దు వెంకన్నాయుడు, కర్రి పాపారాయుడు, దూలం నాగేశ్వరరావు, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, పి.కె.రావు, పార్టీ రాష్ట్ర విభాగాల ప్రతినిధులు గొల్లపల్లి డేవిడ్ రాజ్, జక్కంపూడి వాసు, కాశి బాల నాగకుమారి, కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు), కుడుపూడి భరత్ భూషణ్, పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, షేక్ అబ్దుల్ ఖాదర్, దొమ్మేటి సత్య మోహన్, చీకట్ల కిషోర్, సలాది సతీష్, తోరం గౌతమ్, మిండగుదిటి శిరీష్, ఉంగాల సంతోష్ పాల్గొన్నారు.
డీఎస్సీలో అక్రమాలు నిజం.. దమ్ముంటే కేసు పెట్టండి
‘టెట్ నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం తప్పు కాదా? క్లబ్బుల్లో బ్రిడ్జ్ గేమ్ ఆడే వారికి టీచర్ ఉద్యోగాలు ఇస్తారా? ఇదెక్కడి దారుణం? అడిగిన వారి మీద సీఎం చంద్రబాబు తన సొంత మీడియాతో వార్తలు రాయిస్తారా? కేసులు పెడతామని బెదిరిస్తారా? డీఎస్సీలో అక్రమాలు నిజం.. కేసు పెట్టే దమ్ముందా?.. దమ్ముంటే మా మీద కేసులు పెట్టండి’ అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. చంద్రబాబు డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల మీడియాలో స్పోర్ట్స్ అసోసియేషన్లలో తప్పు జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయం
రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావడం ఖాయమని బొత్స స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని, చంద్రబాబు మోసాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. బాబు అరాచక పాలనను ఛీకొడుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వ పరిస్థితి ముందుముందు మరీ ఘోరంగా ఉంటుందన్నారు.


