గోదావరి ఒడ్డుకు కొట్టుకువచ్చిన చనిపోయిన చేపలు
ఫ గోదావరిలో వేలాది చేపలు మృత్యువాత
ఫ రసాయనాలే కారణమా?
యానాం: గౌతమీ గోదావరి తీరంలో మత్స్య విలాపం చోటుచేసుకుంది. యానాంలోని గౌతమీ గోదావరి ఒడ్డుకు చనిపోయిన వేలాది చేపలు కొట్టుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం తెల్లవారు జామున ఇవి స్థానిక రాజీవ్ బీచ్‌లో జీసెస్ స్టాట్యూ నుంచి శివమ్‌బాత్ వరకూ తేలియాడుతూ కనిపించాయి. ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లింది. పలువురు మత్స్యకారులు నావల సహాయంతో వాటిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఎక్కువగా కానాగంతల రకం చేపలు మృత్యువాత పడ్డాయి. ఎప్పుడూ గోదావరిలో ఇలా చేపలు మృత్యువాత పడటం చూడలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి వరద నీరు యానాం వైపునకు బంగాళాఖాతంలో కలిసేలా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వరద నీరు వల్ల ఇలా జరిగిందా.. ఏవైనా రసాయనాలు, విష పదార్థాలు జలాల్లో కలిసి ఉంటాయా అని అనుమానిస్తున్నారు. రసాయనిక, విష పదార్థాల వల్ల చేపలు మృత్యువాత పడి ఉంటాయని స్థానిక ఎస్‌ఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉష్ణోగ్రతలో మార్పులు కూడా కారణం కావొచ్చన్నారు. చనిపోయిన చేపలను ల్యాబ్‌లో పరీక్షించడం ద్వారా కారణం తెలుస్తుందన్నారు.


