ఫ ఆరుగురిపై బైండోవర్ కేసులు
ఫ గ్రామంలో 144 సెక్షన్ అమలు
తాళ్లరేవు: ఆంధ్రా – యానాం సరిహద్దు ప్రాంతమైన తూర్పుపేట గ్రామంలోని వివాదాస్పద స్థలంలో పుదుచ్చేరి ప్రభుత్వం ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణ పనులు చేపట్టడంపై ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆ స్థలంలో యానాం పోలీసుల సమక్షంలో ప్లాంటు నిర్మాణ పనులను పుదుచ్చేరి అధికారులు ప్రారంభించారు. నివాసాలకు సమీపంలో ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టడంపై సమీప ప్రాంత ప్రజలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తాళ్లరేవు మండల అఖిలపక్ష నాయకులు ధూళిపూడి నాగేంద్రప్రసాద్, జక్కల ప్రసాద్‌బాబు, పిల్లి సత్తిబాబు, వనమాడి రాంబాబు, శిరగం సతీష్, వాసంశెట్టి సూరిబాబు సారథ్యం వహించారు. అయితే ఈ పనుల నేపథ్యంలో సమీపంలోని ఒక చెరువు వద్ద ఉన్న ఆ అఖిలపక్ష నాయకులను కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో కోరంగి పోలీసులు అరెస్ట్ చేసి.. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని కాకినాడ ఆర్డీఓ కోర్టులో హాజరుపరచగా, ఆరు నెలల పాటు బైండోవర్ చేస్తూ కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారన్నారు. కాగా అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఈ భూమి వివాదం హైకోర్టు పరిధిలో ఉందని చెప్పారని, అయితే ఆ స్థలంలో నిర్మాణాలు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద భూమిలో నిర్మాణాలు చేపడుతున్న వారిని వదిలేసి మండల నాయకులను అరెస్ట్ చేయడంపై విస్తుబోతున్నారు. ఈ ఘటనలపై అఖిలపక్ష నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదిలా ఉండగా, తూర్పుపేటలోని ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణానికి సమీప ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు.


