ఫ కనీస వేతనాల కోసం
అంగన్‌వాడీల ఆందోళన
ఫ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
అమలాపురం రూరల్: కనీస వేతనాల కోసం అంతా కదలివచ్చారు.. సమస్యలు తీర్చాలంటూ గళం విప్పారు.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ సిబ్బందితో కలెక్టరేట్ ప్రాంతం మార్మోగింది. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా శుక్రవారం అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితరాలు అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పట్టణ సీఐ వీరబాబు, ఎస్సై కిషోర్‌కుమార్‌లు ఆందోళనకారులతో చర్చించారు. అయినా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు సీడీపీఓ రా జ్యలక్ష్మి రాగా, సమస్యలపై అంగన్‌వాడీ సంఘ జిల్లా అధ్యక్షురాలు బి.వెంకటలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కృష్ణవేణి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసీడీఎస్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయినా నేటికీ అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు పెంచుతామని, మినిట్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చి, తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమని అన్నారు. ఒకపక్క యాప్‌ల భారంతో అంగన్‌వాడీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్‌కు ఐదేళ్లు సర్వీస్ ఉండాలనే నిబంధన తొలగించాలని, నవచేతన యాప్ రద్దు చేయాలని కోరారు. ఈ ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గాప్రసాద్, నూకల బలరాం, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ నాయకులు ఇ.వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కరరావు, టి.నాగవరలక్ష్మి సంఘీభావం ప్రకటించారు. యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు రత్నకుమారి, విజయ, పార్వతి, కె.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద
ఆందోళన చేస్తున్న
అంగన్‌వాడీ సిబ్బంది


