కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: గోదావరి వరదల నేథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశం, గోదావరి వరదలు– అధిక వర్షాల సన్నద్ధత, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి.. ఉత్సవాల నిర్వహణలో వివాదాలు జరగకుండా చూడాలన్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పటిష్ట కార్యాచరణతో సాగాలన్నారు. పంట కాలువలు, చెరువులు, గట్లకు గండ్లు పడే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి పటిష్టం చేయాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా 3 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరకులను సిద్ధంగా ఉంచాలన్నారు. అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ల కోసం జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందం రానున్నాయన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో పోలీస్ యంత్రాంగం సమగ్ర సేవలందిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రగతిపై జేసీ వైఖోం నైదియాదేవి సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో వి.సుబ్బారావు, ఆర్డీఓలు జీవీవీ సత్యనారాయణ, ఎ.సరళావతి తదితరులు పాల్గొన్నారు.


