పెరవలి: ఊహించని విధంగా కంద ధర పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు తదితర మండలాల్లో గత ఏడాది 1,050 హెక్టార్లలో కంద సాగు జరగగా ఈ ఏడాది అది 1,450 హెక్టార్లకు పెరిగింది. గత ఏడాది ఎకరాకు 60 నుంచి 70 పుట్ల (232 కిలోలు) వరకూ దుంప ఊరికలు (దిగుబడి) రాగా, ఈ ఏడాది అది 50 నుంచి 60 పుట్లకు పడిపోయింది. అయినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు కలత చెందుతున్నారు.
పెట్టుబడి ఇలా..
కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎకరం కంద సాగుకు 30 పుట్ల విత్తన దుంప కావాలి. పుట్టు రూ.8 వేల చొప్పున 30 పుట్ల రూ.2.40 లక్షల వరకూ అయ్యింది. దీంతో పాటు దుక్కు, నాట్లు, బోదెలు తవ్వకం, చచ్చు ఎక్కవేయడానికి కూలీలకు రూ.లక్ష వరకూ ఖర్చయ్యింది. అలాగే, పెంట వేయటానికి రూ.30 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ.40 వేలు, నీటి తడులు, కలుపు తీతకు రూ.25 వేలు అయ్యింది. ఈవిధంగా రైతులు ఎకరాకు రూ.4.35 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు.
ధరలు పడిపోయాయిలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పుట్టు కందకు ఏకంగా రూ.11 వేల వరకూ ధర పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత ఏడాది పుట్టు ధర రూ.7 వేలకు పడిపోగా.. అది రూ.6 వేల వద్ద ప్రారంభమై, ప్రస్తుతం రూ.5 వేలకు దిగజారిపోయింది. ఎకరాకు సాగు ఖర్చు రూ.4.35 లక్షలు అవుతూండగా.. ప్రస్తుత ధర ప్రకారం 50 పుట్లకు రూ.2.50 లక్షలు, 60 పుట్లకు రూ.3 లక్షల వరకూ మాత్రమే ఆదాయం వస్తోంది. దీంతో, ఎకరాకు రూ.1.35 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకూ నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తవ్వకాలు చేపట్టిన మొదట్లోనే ధరలు ఇలా ఉంటే.. పంటంతా చేతికి అందే రానున్న రోజుల్లో మరింత పతనమవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పడిపోయిన కంద ధర
గత ఏడాది పుట్టు రూ.7 వేలు
నేడు రూ.5 వేలు
ఎకరానికి రూ.1.85 లక్షల నష్టం
గగ్గోలు పెడుతున్న రైతులు
జిల్లాలో కంద సాగు వివరాలు
సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు
రైతులు 6,000
ఈ పంటపై ఆధారపడిన వారు 20,000
ఎకరాకు దిగుబడి 50 – 60 పుట్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
హయాంలో పుట్టు ధర రూ.11,000


