అమలాపురం టౌన్: అంత్యోదయ రేషన్ కార్డులను నిలిపివేయడం దారుణమని, దీనివల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ హోమ్‌లో గురువారం జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడారు. అంత్యోదయ కార్డులు ఆహార భద్రతకు ఆధారంగా ఉన్నాయని రమాదేవి అన్నారు. వాటిని రద్దు చేయడం వల్ల పేద కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ మాజీ అధ్యక్షుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కార్డుల నిలిపివేత నిర్ణయాన్ని పునః పరిశీలించి, తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆహార భద్రత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. ఈ హక్కుకు భంగం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడం దారుణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఐ.మంగాదేవి, బుంగ సత్యనారాయణ, పాము బాలయ్య, దైవ కృప, గోపాలన్, అమూల్య, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.


