ముమ్మిడివరం: ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిన మార్‌స్స్ మెమోపై కోనసీమ జిల్లా అని ముద్రించడం దురదృష్టకరమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం కోరింది. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేసింది. జిల్లాలో విద్యాలయాల నేమ్ బోర్డులో, ప్రధానోపాధ్యాయులు ఉపయోగించే స్కూల్స్ స్టాంప్స్‌పై జిల్లా పేరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని ఉండేలా చూడాలన్నారు. విద్యా శాఖలో పనిచేసి మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు త్వరితగతిన కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోసంగి బంగార్రాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్‌బాబు, గౌరవాధ్యక్షుడు ఎంఏకే భీమారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గెడ్డం ప్రదీప్, ముమ్మిడివరం మండల శాఖ అధ్యక్షుడు మట్టపర్తి శ్రీనివాసరావు, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం
రైతుల ఆందోళన
అమలాపురం రూరల్: పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ వన్నెచింతలపూడిలో కౌలు రైతులు ఆందోళన చేశారు. ఇమ్మిడివరప్పాడు, శెట్టిపల్లి, తాండవపల్లి, వన్నె చింతలపూడి గ్రామాలకు సాగునీరు అందించకపోతే, పంట విరామం ప్రకటించడం తప్ప, వేరే దారిలేదని హెచ్చరించారు. ఏటా జూన్ నాటికే కాలువల్లోకి నీరు వచ్చేదని, జూలై రెండో వారం వచ్చినా నీరు అందించకపోవడం దారుణమని వారు పంట చేనులో నిరసన వ్యక్తం చేశారు. ఒకపక్క నీరు లేక వన్నె చింతలపూడి రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క చిందాడగరువు రైతులు మోటార్ల సాయంతో నారుమళ్లు వేస్తున్నారని అన్నారు. సకాలంలో నారుమళ్లు వేయకపోతే, వరి పంట నష్టాల పాలవుతుందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, వరి చేలుకు నీరు అందించాలని.. లేనిపక్షంలో రైతులంతా కలసి ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతులు పెయ్యాల సత్యనారాయణ, పరమట వసంతరావు, లంక సత్యనారాయణ, బాలయోగి, ప్రసాద్, సుదర్శన్, వెంకటేశ్వరరావు, అత్తిలి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జ్ఞానేశ్వరి కోసం అడవిలో
మరోసారి వెతికిస్తాం
తుని రూరల్: రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైన ప్రాంతాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. సీహెచ్ అగ్రహారం గ్రామానికి గురువారం వచ్చిన ఆయన చిన్నారి తల్లిదండ్రులు సుంకర భవాని, గణేష్‌లను పరామర్శించారు. జ్ఞానేశ్వరి జాడ తెలుసుకునేందుకు కొండ ప్రాంతాలపై అవగాహన ఉన్న వ్యక్తులతో మరోసారి వెతికిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జ్ఞానేశ్వరి చివరిసారి కనిపించిన ప్రాంతాన్ని, ఆయిల్‌పామ్ తోటకు, అటవీ ప్రాంతానికి మధ్య రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను కలెక్టర్ పరిశీలించారు. దర్యాప్తు పురోగతిపై రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై బి.కృష్ణమాచారిలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ సీహెచ్ రవికుమార్‌వర్మ కలెక్టర్ వెంట ఉన్నారు.


