ఆలమూరు: ఉల్లి పాయలను కొంటేనే కన్నీరు వస్తోంది. రోజు రోజుకూ ధర కొండెక్కుతోంది. గత నెల చివరి వారంలో నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకూ ఉండగా, ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.50కు పైనే చేరింది. చిరు వ్యాపారులు ఆటోలపై ఇళ్ల వద్దకు వచ్చి కొంచెం నాసిరకం ఉల్లిపాయలు మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికితోడు ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేశారు. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో పండించే ఉల్లి సాగు ఇంకా అందుబాటులోకి రాకపోవడం కూడా పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్‌గా రాజమహేంద్రవరం, మడికి, రావులపాలెం, చొప్పెల్ల, కాకినాడ, తుని ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడకు కూడా ఉల్లి దిగుమతులు తగ్గాయి.
రోజుకు వెయ్యి టన్నులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు సగటున సుమారు వెయ్యి టన్నుల ఉల్లి వినియోగం జరుగుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కర్నూలు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి. అక్కడ నుంచి రోజూ సుమారు 50 లారీల్లో ఉల్లి ఉమ్మడి జిల్లాకు సరఫరా జరుగుతుంది. ఎగుమతులు జరిగే ఇతర రాష్ట్రాల్లో ఉల్లి దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం సుమారు 30 లారీల్లో రోజుకు కేవలం 650 టన్నుల వరకూ మాత్రమే దిగుమతి అవుతుంది. రాష్ట్రంలో కొత్త పంట అందుబాటులోకి వచ్చే వరకూ ఉల్లి ధరలు పెరగడమే తప్ప తగ్గడం మాత్రం ఉండదని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ధరల నియంత్రణ ఎక్కడ!
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కానరావడం లేదు. ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో పాటు నాఫెడ్‌లోని ఉల్లి నిల్వలను మార్కెట్‌లోకి అందుబాటులోకి సత్వరమే తీసుకువస్తే ఉల్లి ధరల నియంత్రణ సాధ్యమవుతుందిని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలో
ఉచిత సీట్లు ఇవ్వాల్సిందే..
అమలాపురం టౌన్: ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాల్సిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేటాయింపును కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేష్ చంద్రవర్మ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యా శాఖకు రూ.20 వేల జరిమానా విధించిందని న్యాయవాది రమేష్ చంద్రవర్మ స్థానిక విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదని చెప్పిన వాదన నిరాధారమైందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై పదే పదే వాయిదాలు కోరడం సరైన పద్ధతి కాదని కోర్టు పేర్కొంది. కౌంటర్ అఫిడివిట్ దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన జరిమానా రూ.20 వేలను న్యాయ సేవాధికార సంస్థకు చెల్లంచాలని విద్యా శాఖను కోర్టు ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని ఇందుకు బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేసుకునే వెసులబాటును కోర్టు కల్పించింది. ప్రైవేటః పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపుపై తాను కోర్టులో పిటీషన్ దాఖలు చేశానని రమేష్ చంద్రవర్మ తెలిపారు.
విద్యా శాఖకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
అన్నవరం: పైలట్ ప్రాజెక్టు అంటూ ‘తల’నొప్పి తెచ్చారు. ఆన్‌లైన్ ద్వారా సేవా టిక్కెట్లు విక్రయించేందుకు అన్నవరం దేవస్థానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. దీనివల్ల ఏ టిక్కెట్ కావాలన్నా డిజిటల్ పేమెంట్ చేయాల్సిందే. చివరికి తలనీలాలు ఇచ్చేందుకు (కేశఖండన) టిక్కెట్ కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవాలనే నిబంధన పెట్టారు. ఇప్పటి వరకు వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదం కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో కొనాల్సి వచ్చేది. నగదుతో కొనుగోలుకు అవకాశం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కొత్తగా కేశఖండన టిక్కెట్ రూ.40 పెట్టి కొనాలంటే, కచ్చితంగా డిజిటల్ పేమెంట్ తీసుకువచ్చారు. ఇక నగదుతో టిక్కెట్లు ఇవ్వడం లేదు. అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పర్వదినాల్లో రోజుకు వెయ్యి మంది, సాధారణ రోజుల్లో సుమారు 500 మంది తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇక్కడ 73 మంది నాయీ బ్రాహ్మణులు పనిచేస్తున్నారు.
ఇబ్బంది పడుతూ..
తలనీలాలు సమర్పించేందుకు వచ్చేటప్పుడు చాలా మంది భక్తులు పంచె లేదా రుమాలు కట్టుకువస్తారు. వారు టిక్కెట్‌కు సరిపడా నగదు తెస్తారు. చాలామంది ఫోన్లు కూడా తీసుకురారు. తీరా కేశఖండన కౌంటర్ వద్దకు వచ్చాక, అక్కడ నగదుకు టిక్కెట్ ఇవ్వడం లేదని తెలిసి ఇబ్బంది పడుతున్నారు. తిరిగి ఫోన్ తెచ్చుకుని టిక్కెట్ కోసం పేమెంట్ చేస్తున్నారు. గురువారం ఇదే విధంగా కేశఖండన చేయించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. కాగా, దీనిపై దేవస్థానం అధికారులను వివరణ కోరగా కేశఖండన టిక్కెట్లు ఆన్‌లైన్‌తో పాటు నగదుకు కూడా విక్రయించాలని కౌంటర్ సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలుత ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
ఫ ఒక్కసారిగా పెరిగిన ధర
ఫ నాణ్యమైన పాయలు కిలో రూ.50 పైనే
ఫ కేశ ఖండనకూ
ఆన్‌లైన్‌లోనే టిక్కెట్
ఫ నగదుకు నో అంటున్న సిబ్బంది


