అలల పంచన.. అపాయం అంచున..
●
● ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు
● మన పంట్లు, నాటు పడవలూ సేఫేనా?
● రోజూ వందలాది మంది రాకపోకలు
● అరకొరగా లైఫ్ జాకెట్లు
● గతంలో పడవలూ, టూరిస్ట్ బోట్లు
మునిగి... పోయిన అనేక ప్రాణాలు
● అయినా వంతెనల నిర్మాణాలకు
మీనమేషాలు
మలికిపురం: నేటి ఆధునిక కాలంలో అనేక చోట్ల షికారుకే పరిమితం అయిన బోట్ల ప్రయాణం నేటికీ కోనసీమ ప్రజల జీవన యానానికి అవసరం అంటే మీరు నమ్మగలరా? చెక్కలతో నీటిపై తేలియాడేలా చేసే నాటు పడవలు, పంట్లు... ఇవే ఇక్కడ ప్రయాణానికి దిక్కు. సముద్రం ఆటుపోట్ల కారణంగా బ్యాక్ వాటర్ అధికంగా రావడం, వరదల బీభత్సం అధికంగా ఉండే నదీ మార్గాలు ఇవి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి – పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య గల మాధవాయపాలెం రేవు, సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు, ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులు ఇందుకు తార్కాణం. ఇటువంటి ప్రధాన అధిక ప్రజల రవాణా జరిగే ప్రమాదకర రేవులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వాహనాల రాకపోకల కోసం జాతీయ, రారష్ట్‌ర రహదారులకు మాత్రమే వంతెనలు వేస్తున్నాయి తప్ప ఇక్కడ సాధారణ ప్రజల సురక్షిత రాకపోకలకు వారధి నిర్మించడం లేదు.
సఖినేటిపల్లి – నర్సాపురం రేవు
కొద్ది సంవత్సరాల క్రితం దేవీపట్నం వద్ద లాంచీ మునగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రేవులలో భద్రత అంశంపై అప్పట్లో హడావుడి చేసి టూరిస్ట్ బోట్లపై కూడా ఆంక్షలు విధించారు. సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ కోనసీమ రేవులలో నదీ ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. అలల తాకిడి కూడా అధికమే. పోటు సమయంలో పంటు సైతం అలలపై ఎగిరి పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రయాణికులకు భద్రత పూజ్యం. ప్రస్తుతం వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవులో రెండు పంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ రేవు వేలం పాట ఏడాదికి రూ.కోటి యాభై లక్షలకు పైగా పలుకుతుంది. ఈ రేవు సముద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దగ్గరగా నదికి మలుపు ఉంటుంది. దీంతో నది ప్రవాహ వేగం, ఆటుపోట్లకు అలల తీవ్రత అధికం. మత్స్యకారుల వేట బోట్లు సైతం ఇక్కడ అధికం. దీంతో ఇక్కడ పలుమార్లు పంటు, బోట్లు ఢీకొన్నాయి. ప్రాణనష్టాలు త్రుటిలో తప్పాయి. గడచిన నాలుగేళ్లలో నాలుగు సార్లు ఇంజను మధ్యలో ఆగిపోయి పంట్లు నాలుగు కిలోమీటర్ల వరకూ జనంతో సముద్రం వైపు వెళ్లి పోయాయి. గతంలో ఇక్కడ నాటు పడవలు మునిగి పలువురు చనిపోవడంతో పంటుపై ప్రయాణాలే కొనసాగిస్తున్నారు. వందేళ్ల నుంచి ఇక్కడ వంతెన కోసం ఐదుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. కానీ, నిర్మాణం ప్రారంభం కాలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 216 జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ఇక్కడ వంతెన నిర్మాణం కోసం కేంద్రం ద్వారా రూ.600 కోట్లు మంజూరు చేయించారు. భూసేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేసే సమయంలో టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా కోర్టులో కేసు వేశారు. దీంతో, నాలుగు రోజుల్లో జగన్ శంకుస్థాపన చేస్తారనగా వంతెన నిర్మాణం, రోడ్ల పనులకు బ్రేక్ పడింది.
జగన్‌కు పేరు రాకూడదనే కేసు కుట్ర
ఈ వంతెన కం రోడ్డుకు సంబంధించి కేవలం మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కోర్టులో కేసు వేశారు. తన పొలం మీదుగా రోడ్డు వేయవద్దని, తాను చాలా పేద రైతునని పేర్కొన్నారు. ఈ కేసును కింది కోర్టులు కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హియరింగ్ ఈ నెల 17న ఉందని జాతీయ రహదారుల అధికారులు చెప్పారు. ఫిర్యాదుదారుకు ఇవ్వాల్సిన పరిహారం కోర్టుకు జమ చేసినట్లు పేర్కొన్నారు. చాలా చిన్న విషయాన్ని పట్టుకుని ఏకంగా రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టును అమలు చేయకుండా ఉండడం చంద్రబాబు సర్కారు కుట్రగా భావిస్తున్నారు. మాజీ సీఎంకు జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది.
సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు
సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవులో గత వైఎస్సార్ సీపీ హయాంలో పంట్లు ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ నాటు పడవలే గతి. రాత్రి వేళల్లో కూడా ఇక్కడ నాటు పడవల పైనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు ఎవరి వైపు వారే రేవులు పాడుకుంటారు. బోట్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. ఇక్కడ రద్దీ ఉన్నా పంట్లు వేయడం లేదు. దీంతో ప్రమాదకరమైనా నాటు బోట్ల పైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. నాటు పడవలపై లైఫ్ జాకెట్లు ఉండవు.
కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు
ఇది బ్రిటిష్ కాలం నుంచీ రాకపోకలు అధికంగా ఉండే రేవు. ఇక్కడ వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ రేవులన్నీ నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. బైక్‌లు, కార్లు, అవసరమైతే పశువుల రవాణా కూడా జరుగుతుంది. ట్రిప్‌కు 100 నుంచి 200 మందికి పైగా ప్రయాణికులు ఉంటారు. కార్లు, బైక్‌లు అదనం. ఒక్కొక్కసారి లారీలను కూడా పంట్లపై ఎక్కిస్తారు. పడవలపై కార్లు కూడా ఎక్కిస్తారు. కానీ పదుల సంఖ్యలో మాత్రమే లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఇక్కడ పడవలు, పంట్లు ఇంజన్ల సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయి.
చంద్రబాబు పాలనలో ముందుకు
సాగని పనులు, ప్రతిపాదనలు
గోదావరి నది రేవులు, నది మధ్యలో లంకల ప్రజల శ్రేయస్సు కోసం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రూ.600 కోట్లతో తలపెట్టిన సఖినేటిపల్లి – నర్సాపురం (రామేశ్వరం – రాజుల్లంక) వంతెన, జాతీయ రహదారి (బైపాస్) పనులను ముందుకు తీసుకుని రావడం లేదు. భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా, జనసేన నుంచి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ (రిటైర్డ్ ఐఏఎస్) ప్రాతినిధ్యం ఉండి కూడా ఇక్కడ పనులు సాగడం లేదు. గత సీఎం జగన్ మంజూరు చేయించిన ఈ పనులకు భూసేకరణ నిధులు రెవెన్యూకు, రైతులకు బదలాయించారు. అయినా, ముందుకు సాగడం లేదు. ముక్తేశ్వరం – కోటిపల్లి వంతెనకు అప్పటి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ద్వారా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రభుత్వం వాటినీ పట్టించుకోవడం లేదు. ఊడిమూడి రేవు వద్ద వంతెనకు గత సీఎం జగన్ రూ.40 కోట్లు మంజూరు చేశారు. వంతెన దాదాపు పూర్తయినా మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి.


