నిధుల దుర్వినియోగంపై చర్యలకు సిఫారసు
– వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి మునికుమారి
సాక్షి, అమలాపురం: ముమ్మిడివరం నగర పంచాయతీలో గతంలో టీడీపీ ఏలుబడిలో ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై మున్సిపల్ కమిషనర్‌తోపాటు నలుగురు అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యురాలు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కాశి బాల మునికుమారి తెలిపారు. అమలాపురంలో గురువారం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2014–19లో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఎస్‌సీ సబ్ ప్లాన్ నిధులు రూ.నాలుగు కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అప్పట్లో కౌన్సిల్ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న తాను, వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేశామన్నారు. దీనిపై తాను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు జరిగిన అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా అందించానన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడంతోపాటు నామినేషన్ పద్ధతిలో పనుల పేరుతో నిధులు దుర్వినియోగం జరిగాయని మునికుమారి తెలిపారు. నాడు విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారన్నారు. నాడు అందిన నివేదికపై ప్రభుత్వం ఇప్పుడు స్పందించి చర్యలకు సిద్ధమైందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అప్పుడు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పి.రవివర్మ, నాడు మున్సిపల్ ఇంజినీరుగా ఉన్న కె.వెంకటరావు, మేనేజర్‌గా ఉన్న బి.శ్రీలక్ష్మి, అకౌంటెంట్‌గా ఉన్న టి.చిట్టిబాబులపై చర్యలకు రంగం సిద్ధమైందన్నారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఈ నలుగురు నుంచి తుది విచారణ చేసి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు.


