‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుపుదాం
అంబాజీపేట: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యత ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది ‘పది’ పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. జిల్లా నుంచి 19,640 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిని షైనింగ్ స్టార్స్ మార్చాలన్నారు. పాఠశాలకు రాని పదో తరగతి విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అంతకు ముందు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. కొత్తపేట డివిజన్ డీవైఈఓ కాండ్రేగుల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆలయ ప్రహరీకి
రూ.50 వేల విరాళం
కొత్తపేట: వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ తల్లి ఆలయ ప్రహరీ నిర్మాణానికి బిళ్లకుర్రు శివారు యెలిశెట్టివారిపాలేనికి చెందిన సూరవరపు వెంకట్రావు, రామలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50 వేల విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణకు అందజేశారు. అలాగే సామర్లకోటకు చెందిన దివంగత కారుమూరి రాజేశ్వరరావు, సత్యవేణి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమార్‌గుప్తా రూ.20,116, అమెరికాకు చెందిన శంభు రవికృష్ణ, భాస్కర వెంకటలక్ష్మి దంపతులు రూ.20 వేలు, వానపల్లికి చెందిన నేమాని పురుషోత్తమ ప్రసాద్, సుందరిలక్ష్మి దంపతులు రూ.10 వేలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాతల పేరున ఆసాదులు ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు.
‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుపుదాం


