పాల్ ల్యాబ్స్ వినియోగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం
ముమ్మిడివరం: సీఎంశ్రీ పాఠశాలల్లో పర్సనల్ అడాఫ్టివ్ లెర్నింగ్ (పాల్) ల్యాబ్స్‌ను విద్యార్థులు ఉపయోగించడంలో జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం లభించిందని సమగ్ర శిక్ష ఏఎంఓ, పాల్ ల్యాబ్స్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ పి.రాంబాబు తెలిపారు. అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాల్ ల్యాబ్‌ను ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎం.శ్రీనివాసరావుతో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది పీఎంశ్రీ పాఠశాలల్లో నూతనంగా పాల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటిని వినియోగించడంలో జిల్లా 96.22 శాతంతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పాల్ ల్యాబ్ 111.67 శాతం ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గతంలో మంజూరైన పాల్ ల్యాబ్స్‌లో కాలపరిమితి ముగిసి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు


