గంజాయి అక్రమ రవాణాను నిరోధించాలి
అమలాపురం రూరల్: గంజాయి అక్రమ రవాణాను అన్ని దశల్లోనూ నిరోధించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్‌లో నార్కెట్ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రహస్య సమాచారం ఆధారంగా హైవేలు, ఫ్రూట్ మార్కెట్లు, చెక్ పోస్ట్‌లు, పార్సిల్, కోరియర్ ఆఫీస్‌లు, ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలతో అనర్థాలు వివరించి యువతను సన్మార్గంలో నడిపించడం ద్వారా ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్నారు. కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచుతూ, యాంటీ–డ్రగ్ క్లబ్‌లు, క్యాంపెయిన్‌లు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గ్రామ శివార్లు, పాన్, కిళ్లీ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర, డీసీహెచ్‌ఎస్ కార్తీక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులకు పరిహారం
అయినవిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులతో రబీ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.60,613 చొప్పున పరిహారంగా ఏపీ ట్రాన్స్‌కో అందిస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఏపీ ట్రాన్స్‌కో, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 22 కిలోమీటర్ల మేర విద్యుత్ టవర్ల ఏర్పాటు సమయంలో పనుల నిర్వహణకు ఆయా ప్రాంత రైతులు రబీలో పంట నష్టపోతున్నారన్నారు. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అయినవిల్లి మండలాల పరిధిలో 64 విద్యుత్ టవర్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ టవర్లు వెంబడి సుమారు 563 ఎకరాల్లో రబీ సాగును నిలుపుదల చేసినందుకు రైతులకు పరిహారంగా రూ.3.41 కోట్లను ఏపీ ట్రాన్స్‌కో కేటాయించిందన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రభల ఉత్సవాలకు ఆటంకం కలగకుండా టవర్ల ఎత్తు పెంచాలని అన్నారు. ఏపీ ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజినీర్ మనోహర్, ఈఈలు పుల్లారావు, వెంకట్రావు, డీఈ చంద్రశేఖర్ ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లైన్ల రహదారికి కార్యాచరణ
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో కాలువ గట్టు నుంచి గుడి వరకూ సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కార్యాచరణ చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి భూ సేకరణపై సమీక్షించారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుండడంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పరిహారాలను దేవస్థాన అధికారులు చెల్లించడానికి ముందుకు వచ్చారన్నారు. భూసేకరణకు గాను సుమారు రూ. 6 కోట్లు అవుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సుమారు రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
ఫ జిల్లాలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీలో రైతులకు, మహిళా సంఘాలకు, యువ పారిశ్రామిక వేత్తలకు దిక్సూచిగా ఇంక్యుబేషన్ సెంటర్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. దీనిపై కలెక్టరేట్‌లో కొబ్బరి, పారిశ్రామికవేత్తలు, జిల్లా పరిశ్రమల కేంద్రం ఎమ్‌ఎస్‌ఎంఈ ప్రతినిధులు, ఉద్యాన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మామిడికుదురు, ఉప్పలగుప్తంలలో కొబ్బరి పరిశ్రమలు స్థాపన అంశాలపై సమీక్షించారు. జిల్లాలో రైతులకు అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.


