పండగ సంబేరాలు లేక.. | - | Sakshi
Sakshi News home page

పండగ సంబేరాలు లేక..

Dec 27 2025 7:57 AM | Updated on Dec 27 2025 7:57 AM

పండగ

పండగ సంబేరాలు లేక..

అమలాపురం శ్రీదేవి మార్కెట్‌లో వ్యాపారం లేక వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు

కర్ఫ్యూ పెట్టినట్టుగా అమలాపురం గోల్డ్‌ మార్కెట్‌ వీధి

తిరోగమనంలో వ్యాపారాలు

వస్త్ర, బంగారు దుకాణాలు వెలవెల

ఇప్పటికే క్రిస్మస్‌ అమ్మకాలు పూర్తి

వచ్చే పండగలకూ కనిపించని జోష్‌

కుదేలైన వివిధ రంగాలు

జనం వద్ద తగ్గిన కొనుగోలు శక్తి

సాక్షి, అమలాపురం: క్రిస్మస్‌ వేడుకలు పూర్తయ్యాయి.. నూతన ఆంగ్ల సంవత్సర సంబరాలు మొదలు కానున్నాయి.. తరువాత సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా జిల్లాకు పండగల జోష్‌ వచ్చినా వస్త్ర, బంగారు వ్యాపారాలు తిరోగమనంలో ఉన్నాయి. జనం, మరీ ముఖ్యంగా అన్నదాతల వద్ద సొమ్ము లేకపోవడం.. రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాలు డల్‌గా ఉండడం.. బంగారం ధరలు కొండెక్కడంతో కొనుగోళ్లు లేక వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి.

జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు వాణిజ్య, వ్యాపార కేంద్రాలైన రావులపాలెం, బండారులంక, తాటిపాక, మలికిపురం, రామచంద్రపురం, మండపేట, ద్వారపూడి, ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పండగ సందడి మొదలు కావాల్సి ఉంది. వస్త్ర, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఇతర ఫర్నీచర్‌ అమ్మకాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా ఉండాల్సి ఉంది. క్రిస్మస్‌ పండగ సంబరాలు జరుగుతున్నాయి. తరువాత ఆంగ్ల సంవత్సరం, ఆపై పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. గతంలో ఈ సమయానికే రిటైల్‌, హోల్‌సేల్‌ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అమలాపురంలో వస్త్ర, బంగారు, ఇతర వస్తువుల కొనుగోలు లేక దుకాణాలు కళావిహీనంగా ఉన్నాయి. ఆయా మార్కెట్లలో మధ్యాహ్న సమయంలో కొనుగోలుదారులు కనిపించడం లేదు. వస్త్రాలను బయట వేలాడదీసి వ్యాపారులు కబుర్లు చెప్పుకుంటున్నారు.

రాష్ట్ర స్థాయిలో పేరొందిన బండారులంకలో సైతం వస్త్ర వ్యాపారం వెలవెలబోతోంది. సాయంత్రం వేళ ఇద్దరు, ముగ్గురు కొనుగోలుదారులు మాత్రమే వస్తున్నారు. ‘సంక్రాంతి కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు కాకున్నా.. ఏటా ఈ సమయానికి కొనుగోలుదారులు ఎక్కువగానే వచ్చేవారు. గతంలో ఈ సమయంలో జరిగే వ్యాపారంలో ఇప్పుడు పావు వంతు కూడా జరగడం లేదు’ అని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఐదేళ్ల కాలంలో అమలాపురంలో మెగా వస్త్ర, బంగారు ఆభరణాల మాల్స్‌ పెద్దఎత్తున వచ్చాయి. అక్కడ కూడా ఇంచుమించు ఇలానే ఉంది.

జిల్లాలో మండపేట, రామచంద్రపురం, తాటిపాక, మలికిపురం, రావుపాలెం వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు పడకేశాయి. పండగ సమయంలో కొత్త మోటార్‌ సైకిళ్లు, కార్లు కొనేవారు ఇప్పటికే బుకింగ్‌లు మొదలు పెట్టేవారు. సంక్రాంతి సమయానికి డెలివరీ కావాలని అడ్వాన్సులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో బుకింగ్స్‌ లేవని వాహన అమ్మకాల డీలర్లు చెబుతున్నారు.

మండపేట మండలం ద్వారపూడి మహాత్మా గాంధీ న్యూ క్లాత్‌ కాంప్లెక్స్‌ మార్కెట్‌ ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారం జరిగేది. ఇప్పటికీ ఇదే ట్రెండ్‌ ఉంది. గత ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు పలు ప్రాంతాల్లో మాల్స్‌ రావడం ఇక్కడ సగం వ్యాపారం తగ్గిపోయింది. జరిగే కొద్దిపాటి వ్యాపారం కూడా ఈ ఏడాది లేకుండా పోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

విపణిలో బంగారం ధర కొండెక్కడం కూడా కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. ప్రస్తుత మార్కెట్‌లో బంగారం 24 క్యారెట్లు గ్రాము ధర రూ.14 వేల వరకూ ఉంది. పది గ్రాములు రూ.1.40 లక్షలు కాగా, కాసు ధర రూ.1.12 లక్షలు. దీంతో సామాన్యులు, పేదలు ఆభరణాల కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

చిల్లిగవ్వ లేక..

జనం వద్ద సొమ్ము లేకపోవడం కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. మరీ ముఖ్యంగా అన్నదాత అప్పుల్లో ఉన్నాడు. వరి గిట్టుబాటు కావడం లేదు. ఖరీఫ్‌ సాగులో రుతుపవనాలు, మోంథా తుపానుతో కురిసిన వర్షాలకు జిల్లాలో 77 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఎకరాకు 30 బస్తాల నుంచి 35 బస్తాల వరకూ రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల 20 బస్తాల నుంచి 25 బస్తాలకు పడిపోయింది. దీనితో పెట్టుబడులు రావడం గగనమైంది. ప్రస్తుతం రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కొబ్బరి కాయ ధర ఇటీవల రూ.22 నుంచి రూ.15కు తగ్గింది. అరటి తుపానుకు నేలచూపు చూడగా, ధరలు రెండు, మూడు రెట్లు తగ్గిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

జిల్లాలో ఆక్వా సాగు సైతం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ధరలు కొంత వరకూ ఉన్నా ఇటీవల మారిన వాతావరణంతో తెగుళ్ల బారిన పడి పంట దెబ్బతింటోంది. పైగా ఇప్పుడు కేవలం మూడో వంతు మాత్రమే సాగులో ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ రంగం గత ఏడాదిగా దాదాపు స్తంభించింది. ఒక్క అమలాపురం పట్టణంలోనే నిర్మాణం పూర్తయిన అపార్ట్‌మెంట్‌లలో సగం ప్లాట్‌లు అమ్ముడు పోక ఖాళీగా ఉంటున్నాయి. లేఅవుట్‌లో స్థలాలు కొనేవారు లేకుండా పోయారు. ఈ ప్రభావంతో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు రియాల్టర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చింది.

జిల్లాలో ఇలా కీలక రంగాలన్నీ సంక్షోభంలో ఉండడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి ఒక్కరిపైనా పడింది. జనం వద్ద డబ్బు లేకపోవడంతో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఇదే వస్త్ర, బంగారు, ఆటోమొబైల్‌ రంగాలపై పడి జిల్లాలో పండగ సందడి లేకపోయింది.

సాధారణ అమ్మకాలూ లేవు

గతంలో కంటే వస్త్ర మార్కెట్‌లో అమ్మకాలు బాగా తగ్గాయి. ద్వారపూడిలో సుమారు 200 హోల్‌సేల్‌, 50 రిటైల్‌ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సాధారణ స్థాయి అమ్మకాలు కూడా లేని పరిస్థితి. రాజమహేంద్రవరం, కాకినాడ తదితర పట్టణాల్లోని షాపింగ్‌ మాల్స్‌ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. మధ్య తరగతి ప్రజలు సైతం అటువైపే వెళుతుండటంతో ద్వారపూడి మార్కెట్‌లో అమ్మకాలు పడిపోయాయి. జనం వద్ద కూడా సొమ్ములు లేవు.

– చిక్కాల శ్రీనివాస్‌, అధ్యక్షుడు, మహాత్మా గాంధీ న్యూ క్లాత్‌ కాంప్లెక్స్‌ మార్కెట్‌, ద్వారపూడి, మండపేట మండలం

పండగ సంబేరాలు లేక..1
1/1

పండగ సంబేరాలు లేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement