ఇదేం యాపారం సామీ..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం యాపారం సామీ..!

Dec 27 2025 7:57 AM | Updated on Dec 27 2025 7:57 AM

ఇదేం

ఇదేం యాపారం సామీ..!

రత్నగిరిపై షాపులో రకరకాల

వస్తువుల విక్రయాలు

టాయిలెట్లకు వాడే ఫినాయిల్‌, కాళ్ల

పగుళ్లకు తైలం కూడా అమ్మకం

‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర

భక్తుల నమ్మకంతో వ్యాపారం

అలా చేయడం సరైనదో కాదో

పరిశీలించకుండానే అనుమతులు

అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు.

రత్నగిరిపై బీజం పడిందిలా..

మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్‌ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్‌ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్‌ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు.

అలా ఎలా ఇచ్చారో..!

దేవస్థానంలో ప్రతి వ్యాపారానికీ వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్‌ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అపచారమో కాదో చూడకుండానే..

ఈ స్టాల్స్‌లో విక్రయాలకు అనుమతులిచ్చిన వాటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్‌, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్‌లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్‌, కాళ్ల పగుళ్ల క్రీమ్‌ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు.

ఈఓ ఆరా

ఈ స్టాల్స్‌ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఆదేశించారు.

ఆ ఫినాయిల్‌ బాటిల్స్‌ మాయం

‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్‌’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్‌’ అని స్టిక్కర్‌ అతికించి అమ్ముతున్న బాటిల్స్‌ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు.

ఇదేం యాపారం సామీ..!1
1/1

ఇదేం యాపారం సామీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement