విలీనమా..విముఖమా..
● పలు గ్రామాల గ్రామసభలకు రంగం సిద్ధం
● పెరగనున్న మున్సిపాలిటీల విస్తీర్ణాలు
● జిల్లాలో మూడు మున్సిపాలిటీలు
● అభివృద్ధి చెందిన పలు
పంచాయతీలలో విముఖత
● కొన్నిచోట్ల అనుకూలంగా తీర్మానాలు
సాక్షి అమలాపురం: జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో వాటిని ఆనుకుని ఉన్న పంచాయతీల విలీన ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. అమలాపురం మున్సిపాలిటీలో మూడు గ్రామాల విలీన ప్రక్రియ మొదలు కావడంతో మిగిలిన మున్సిపాలిటీల్లో పంచాయతీ విలీన అంశం తెరమీదకు వస్తోంది. కాగా ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు పంచాయతీలు విలీన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాయి. తాము చేసుకున్న అభివృద్ధి ఫలాలు మున్సిపాలిటీలకు మళ్లిపోతాయని, మళ్లీ అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను తీర్చిదిద్దుకోవాల్సి వస్తుందని అక్కడి పాలకులు భావిస్తున్నారు.
అమలాపురం మున్సిపాలిటీ గ్రేడ్–1గా గుర్తింపు పొందింది. దీని పరిధిలో ఉన్న పలు వార్డులు అమలాపురం మండలంలోని కామనగరువు, ఈదరపల్లి, పేరూరు పంచాయతీల్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. పదేళ్ల క్రితం మున్సిపాలిటీ చుట్టూ ఉన్న సుమారు 13 గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నా తరువాత వెనక్కు పోయింది. తాజాగా ఈదరపల్లి గ్రామం పూర్తిగా (సర్వే నెంబరు 1 నుంచి సర్వే నెంబరు 82 వరకు), కామనగరువు, పేరూరు పంచాయతీల్లో కొంత భాగం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే పేరూరు బిట్–1లో సర్వే నెంబరు 672 నుంచి 712 వరకు (41 సర్వే నెంబర్లు), కామనగరువులో ఇప్పుడున్న మున్సిపాలిటీ వార్డులతోపాటు జాతీయ రహదారి 216 వరకు సేకరించాలని నిర్ణయించారు.
ఈ సర్వే నెంబర్ల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రాంతం అంతా అమలాపురం మున్సిపాలిటీలో విలీనం కానుంది. ఈ మేరకు ఆయా పంచాయతీలు గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలను చేయాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పంచాయతీ గ్రామ సభలు ఆమోదం తెలిపిన సర్వే నెంబర్ల ఆధారంగా ఈ విభజన జరుగనుంది. అనంతరం మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ జరుగుతుంది. అయితే గ్రామ సభల తీర్మానాలు, ప్రజల ఆమోదం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. తమ గ్రామాలను తప్పనిసరిగా విలీనం చేయడాన్ని అంగీకరించి తీరాలనే నిబంధన ఏమీ లేదు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమలాపురం పార్లమెంట్‌ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా అమలాపురాన్ని గుర్తించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మత్స్యశాఖ, జిల్లా పంచాయతీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఇరిగేషన్, డ్రైనేజీ, ఆర్టీవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని కార్యాలయాలను ముమ్మిడివరం మండలం ఎయిమ్స్ కాలేజీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం అయిన తరువాత అమలాపురానికి ప్రాధాన్యం పెరగడంతో సదుపాయల కల్పన కోసం మున్సిపాలిటీని విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రతిపాదన ఆగింది. తిరిగి ఇప్పుడు విలీన ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అమలాపురం మున్సిపాలిటీ జనాభా సుమారు 53 వేలు. ఇప్పుడనుకున్నట్టుగా విలీనం జరిగితే జనాభా 70 వేల వరకు పెరుగుతుందని అంచనా.
జిల్లాలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదన గతం నుంచి ఉంది. ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీలో పంచాయతీల విలీనం కదలిక రావడంతో మిగిలిన మున్సిపాలిటీలలో కూడా సమీప పంచాయతీల విలీన అంశం తెరమీదకు వస్తోంది. రామచంద్రపురం మున్సిపాలిటీలో రామచంద్రపురం మండలానికి చెందిన ఉట్రుమిల్లి, తాళ్లపొలం, యనమదల, అగ్రహారం, నర్సాపురపుపేట, రాయవరం మండలం పసలపూడి గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం 48 వేల మంది వరకు జనాభా ఉండగా, విలీనం జరిగితే మరో 30 వేల మంది పెరుగుతారు. 2019 ఎన్నికలకు ముందు మండపేట మున్సిపాలిటీలో మండపేట మండలం మారేడుబాక, తాపేశ్వరం, ఇప్పనపాడు, ఏడిద, అర్తమూరు ఐదు గ్రామాలు, కపిలేశ్వరపురం మండలం నుంచి నేలటూరు గ్రామం మొత్తం ఆరు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. మండపేట మున్సిపాలిటీ జనాభా 2011 లెక్కలు ప్రకారం 53,588, మిగిలిన ఆరు గ్రామాలు విలీనమైతే మరో 20 వేల మంది జనాభా పెరుగుతుందని అంచనా.
అమలాపురం పట్టణం
రామచంద్రపురం
మున్సిపల్ కార్యాలయం
విలీనమా..విముఖమా..


