వక్ఫ్ భూముల జోలికి రావద్దు
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూముల జోలికి కూటమి ప్రభుత్వం రావద్దని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్పష్టం చేశారు. ముస్లిం పేదలకు అంజుమన్– ఎ ఇస్లామియా సంస్థ పూర్వీకంలో ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గుంటూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన 71.57 ఎకరాలను ఐటీ పార్కుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీకి చెందిన కొందరి ముస్లిం నాయకులతో కలసి ఖాదర్ గురువారం అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరులో ఐటీ పార్కు అంటే అదో ప్రైవేటు సంస్థ, ప్రైవేటు వ్యక్తులు, వారికి ప్రభుత్వం 71.57 ఎకరాలను ఇచ్చేడంపై వారు నిరసన తెలిపారు. గుంటూరులో భూములను ప్రైవేటు సంస్థకు కేటాయించడం వెనుక ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డు సీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాదర్‌తో పాటు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీవై షరీఫ్, అమలాపురం అధ్యక్షుడు ఖాజాబాబు, పి.గన్నవరం అధ్యక్షుడు అన్వర్ తహె హుస్సేన్, పార్టీ జిల్లా కార్యదర్శి అలీబాబు, ముస్లిం నాయకులు కర్రార్ హుస్సేన్, ఎండీ అలీషా, యూసఫ్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు.
కౌలు రైతు మృతి
ఉప్పలగుప్తం: ఏటా ఖరీఫ్ పంట నష్టపోతూండటం.. రబీకి పెట్టుబడి దొరకపోవడంతో ఆవేదన చెందిన ఓ కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ములపర్తి నరసింహమూర్తి (55) కిత్తనచెరువు గ్రామంలో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ ముంపుతో నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్ పంట తుపాను వర్షాలకు దెబ్బ తింది. కనీసం మాసూలు ఖర్చులు కూడా రాలేదు. ఇదే సమయంలో రబీకి పెట్టుబడి దొరకక నరసింహమూర్తి నెల రోజులుగా దిగులుతో ఉన్నారు. పొలం వద్ద నారుమడిలో నీరు తోడి గురువారం సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
29న నిధి ఆప్ కే నికట్
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయంలో పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్ కే నికట్ జిల్లా ఔట్‌రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్‌లోను ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
వక్ఫ్ భూముల జోలికి రావద్దు


