సత్యదేవుని సన్నిధిలో మహాపచారం | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సన్నిధిలో మహాపచారం

Dec 26 2025 8:21 AM | Updated on Dec 26 2025 8:21 AM

సత్యద

సత్యదేవుని సన్నిధిలో మహాపచారం

పూజలో వాడిన పూలతో

ఫినాయిల్‌ తయారీ!

అన్నవరం దేవస్థానంలో విక్రయాలు

ఆవేదన చెందుతున్న భక్తులు

అన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు.

‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ..

సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్‌ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్‌పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్‌ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్‌’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్‌ లీటర్‌ బాటిల్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్‌ బాటిల్‌పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్‌ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్‌ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్‌ను టాయిలెట్స్‌ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్‌ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

గతంలోనూ అపచారాలు

అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్‌ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్‌ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్‌ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు.

అటువంటివి విక్రయించనీయం

దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్‌ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం.

– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

సత్యదేవుని సన్నిధిలో మహాపచారం1
1/1

సత్యదేవుని సన్నిధిలో మహాపచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement