విరాటపర్వ పారాయణతో శుభ ఫలితాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రామాయణంలో సుందరకాండ, భాగవతంలో దశమ స్కంధం మాదిరిగానే భారతంలో విరాటపర్వానికి ఓ ప్రత్యేకత ఉందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వేదవ్యాస భారత ప్రవచన ధారలో భాగంగా ఆయన గురువారం విరాటపర్వ విశేషాలను వివరించారు. విరాటపర్వ పారాయణ వలన కరువు కాటకాలు నశిస్తాయని, శుభఫలితాలు చేకూరుతాయని చెప్పారు. భారతాధ్యయనం విరాటపర్వంతో ప్రారంభించాలని వ్యాసుడు ఎక్కడా చెప్పలేదన్నారు. మత్స్యరాజు కొలువులో ప్రవేశించే ముందు.. పాండవులు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో.. ద్రౌపది గురించి ధర్మరాజు అన్న మాటలను నేటి తరం స్మరించుకోవాలని అన్నారు. ‘‘ద్రౌపది మనకు ప్రియమైన భార్య. తల్లిని కొడుకు ఎలా రక్షించాలో ఈమెను మనం అలా రక్షించుకోవాలి. అక్కలా గౌరవించాలి. ఈమె మనకు ప్రాణాల కన్నా ప్రియమైనది’’ అని సోదరులతో ధర్మరాజు అంటాడని వివరించారు. వాల్మీకి వ్యాసాదులు రామాయణ భారతాల్లో భార్యాభర్తల అనుబంధాన్ని ఎంతో పవిత్రంగా వివరించారన్నారు. భార్యకు పాతివ్రత్యధర్మాన్ని చెప్పినట్టుగానే.. భర్తకు కూడా భార్య పట్ల అంతటి బాధ్యత ఉందని చెప్పారు. ‘‘కీచకుని ఆగడాలను ప్రతిఘటించడానికి ద్రౌపది ముందుగా సూర్యారాధన చేసింది. అజ్ఞాతవాసం ప్రారంభించడానికి ముందు దుర్గాదేవిని ధర్మరాజు స్తుతించి, ఆమె అనుగ్రహం పొందుతాడు. వేదమంత్రాలకున్న శక్తి భారత పారాయణకుంది. విరాటుని కొలువులో ప్రవేశించే ముందు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ఉపదేశించిన ధర్మాలను మనం విస్మరించరాదు. రాజు కన్నా ఉన్నతాసనం ఆశించరాదు. రాజు భార్యలతో చెలిమి తగదు. రాజు శత్రువులతో మాట్లాడరాదని పాండవులతో ధౌమ్యుడు చెబుతాడు. ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పుకోవడంలో అసత్యం లేదు. కంకుడు అనే పదానికి యమధర్మరాజు అనే అర్థం ఉంది. ఆయన యమధర్మరాజు కుమారుడు’’ అని సామవేదం వివరించారు.


