హిందువులు మౌనం వీడాలి
● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్
● కౌన్సిల్ పూర్వ చైర్మన్ పరవస్తు
● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు
ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయ నాయకుల వద్ద నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేదన్నారు. ఇప్పటికై నా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని తెలియజేశారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బతిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలను నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ గోదావరి జిల్లా సహకార్య వాహ్ గెడ్డం రాంబాబు, మండపేట ఖండ ప్రముఖ్ చక్రవర్తి, వీహెచ్‌పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు తదితరులు పాల్గొన్నారు.


