రబీ సాగేదెలా! | - | Sakshi
Sakshi News home page

రబీ సాగేదెలా!

Dec 24 2025 3:58 AM | Updated on Dec 24 2025 3:58 AM

రబీ స

రబీ సాగేదెలా!

జిల్లాలో అధ్వానంగా డెల్టా కాలువలు

పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు

షార్ట్‌ టైమ్‌ క్లోజర్‌ పనులు చేయించని అధికారులు

రూ.2.70 కోట్ల వీడ్‌ రిమూవల్‌ నిధులు నీటిపాలు

చేయకుండానే బిల్లు చేసుకునే పనిలో నీటి సంఘాలు!

సాక్షి, అమలాపురం: ప్రకృతి వైపరీత్యాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్‌ పంటను కోల్పోయిన రైతులు రబీ సాగుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పంట కాలువలు, మురుగునీటి కాలువల దుస్థితిని చూస్తుంటే జిల్లాలో రబీ సాగు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెలు, మైనర్‌ మురుగునీటి కాలువల్లో తూడు, గుర్రపు డెక్క నిండిపోయాయి. దీనితో శివారు, మెరక ప్రాంతాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు సరికదా.. కీలక సమయంలో డ్రైన్ల నుంచి నీరు తోడుకునే అవకాశం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రబీ సాగుకు జలవనరుల శాఖ అధికారులు డిసెంబర్‌ ఒకటో తేదీన నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తుపాను, వర్షాల వల్ల ఖరీఫ్‌ కోతలు ఆలస్యం కావడంతో రబీ పనులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అలాగే మొదలు పెట్టిన చోట సాగునీరు అందడం లేదు.

నీరు వదులుతున్నా..

గోదావరి మూడు డెల్టాల పరిధిలో పంట కాలువలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు ఐదు వేలు, మధ్య డెల్టాకు రెండు వేలు, పశ్చిమ డెల్టాకు ఏడు వేల చొప్పున మొత్తం 14 వేల క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. అయినా శివారు, మెరక ప్రాంతాలకు నీరు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదంటే అందుకు పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడమే కారణం. ముఖ్యంగా తొలి పంట సాగు చేయని మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో రబీ ముందస్తు సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లోనే శివారుకు నీరందడం లేదు.

దారుణం

జిల్లాలో మురుగునీటి కాలువల వ్యవస్థ మరింత దారుణంగా ఉంది. మేజర్‌, మైనర్‌, మీడియం డ్రైన్లతో పాటు రెవెన్యూ డ్రైన్లలో కూడా తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయాయి. దీంతో ముంపు నీరు దిగే అవకాశం లేకపోవడంతో ఖరీఫ్‌లో 40 వేల ఎకరాల్లో సాగు జరగని విషయం తెలిసిందే. ఇక రబీలో నీటి ఎద్దడి సమయంలో వీటి మీద క్రాస్‌బండ్‌లు వేసి నీరు నిల్వ చేస్తూంటారు. రైతులు వీటి నుంచే మోటార్లతో సాగునీరు సేకరిస్తారు. అయితే డ్రైన్లు పూడుకుపోవడంతో కీలక సమయంలో నీటిని తోడుకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది.

ముంచేసిన నీటి సంఘాలు

రైతులకు మేలు చేసేందుకు ఏర్పడిన నీటి సంఘాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో చేయపోవడంతో పంటలు నీట మునిగి దెబ్బతినే పరిస్థితులను తెచ్చాయి. ఈ ఏడాది మేజర్‌, మీడియం డ్రైన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు గతంలోనే కేటాయించింది. కూనవరం, లోయర్‌ కౌశిక, అప్పర కౌశిక, సాకుర్రు, వృద్ధ గౌతమీ, అమలాపురం, దసరా బుల్లోడుకోడు, వాసాలతిప్ప వంటి డ్రైనేజీల్లో పనులకు ప్రభుత్వం నిర్వహణ నిధులు కేటాయించింది. ఈ పనులను గత ఖరీఫ్‌కు ముందు వర్షాలు రాక ముందే చేపట్టాల్సి ఉంది. కానీ నామినేషన్‌ పద్ధతిలో పనులు చేపట్టిన ప్రాజెక్టు కమిటీ తూడు, గురప్రు డెక్క తొలగించిన పాపాన పోలేదు. ఈ ఏడాది నైరుతిలో లోటు వర్షం కలిసి వచ్చింది. అయినా అరకొరగా పనులు చేసి వదిలేసి, బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. వీరి దోపిడీ వల్ల గత ఖరీఫ్‌లో భారీ వర్షాలు, మోంథా తుపాను సమయంలో జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. పది మేజర్‌ డ్రైన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా.

‘సాక్షి’ వెలుగులోకి తెచ్చినా..

సకాలంలో తూడు, గురప్రుడెక్క తొలగించక పోవడంతో చేల నుంచి ముంపునీరు వీడడం లేదు. దీనివల్ల పంట పెద్ద ఎత్తున కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. గత నవంబర్‌ నాలుగో తేదీన ‘సాక్షి’ పత్రిక ‘‘తుడిచిపెట్టిన నిర్లక్ష్యం’’ అనే శీర్షికన ఈ సమస్యను వెలుగులోకి తెచ్చింది. అయినా అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు. సరికదా బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను తామే చేసినట్టుగా రికార్డు చేయించుకుని బిల్లులు నొక్కేసే పనిలో పడినట్టు సమాచారం.

రబీ సాగేదెలా!1
1/1

రబీ సాగేదెలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement