పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం
అల్లవరం: సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ఎస్పీ రాహూల్ మీనా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ప్రకటనలో అభినందించారు. అలాగే మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన, సీ్త్రలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలను నియంత్రించడానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. నెల రోజులుగా పలు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే సైబర్ నేరాల తీవ్రం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. ఈ తరహా నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో హెచ్చుమీరుతున్నాయన్నారు. ఉద్యోగం, షేర్లు, బాండ్లు, క్రెడిట్ స్కోర్ తదితర విషయాల్లో సోషల్ మీడియా వేదికగా యాప్‌లను డౌన్‌లోడ్ చేయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: జిల్లాలోని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ప్రభుత్వ బీమా పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు పీఆర్‌టీయూ జిల్లా యూనియన్ ప్రతినిధులు మంగళవారం వినతి పత్రాలు అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి మెంగం అమృతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాళం శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ మట్టా శ్రీనివాస్ తదితరులు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. పీఎఫ్ చెల్లింపులకు సంబంధించిన సమస్యలను సరిదిద్దాలని, ప్రభుత్వ బీమా పట్టాలు చేరని వారికి, త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ సమస్యలను కూడా తొందరగా పరిష్కరించాలని కోరారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాయంలోని ఏవో సూర్యప్రకాష్, ఏపీజీఎల్‌ఐ కార్యాలయ సూపరింటెండెంట్ సుధీర్‌కు వినతి పత్రాలు అందజేశారు.
అమరావతికివాజ్‌పేయి కాంస్య విగ్రహం
కొత్తపేట: అమరావతిలో నెలకొల్పే దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని మంగళవారం కొత్తపేట నుంచి తరలించారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్‌కుమార్ వుడయార్ 14 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని టన్నున్నర కాంస్యంతో తయారు చేశారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
30న ఉత్తర ద్వార దర్శనం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ దర్శన అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చెప్పారు.
పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం
పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం


