తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి
గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు తూడు, గుర్రపు డెక్కతో పూడుకుపోయి ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే రబీ సాగు సాఫీగా సాగుతోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం మంగళవారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను కోరింది. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆయనను కలిసింది. జిల్లాలో అధ్వానంగా ఉన్న కాలువల వివరాలు, ఫొటోలతో కూడిన వినతిపత్రం అందజేసింది. అనంతరం జిన్నూరి బాబీ విలేకరులతో మాట్లాడుతూ కాలువలు, డ్రైన్లు అధ్వానంగా ఉండడంతో గత ఖరీఫ్ దెబ్బతిందన్నారు. త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలువల వ్యవస్థ దెబ్బతినడం వల్ల రెండో పంటకు నీరందే అవకాశం లేదన్నారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొర్లపాటి వెంకటేశ్వరరావు (కోటబాబు), చిక్కం బాలయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల జోహార్, ఉప్పలగుప్తం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం సూరిబాబు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి యాళ్ల చిన్నా తదితరులు పాల్గొన్నారు.


