11 నుంచి కోనసీమ సంక్రాంతి సంబరాలు
● కలెక్టర్ మహేష్‌కుమార్
● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
అమలాపురం రూరల్: కోనసీమ సంక్రాంతి సంబరాలు, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలను జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో పర్యాటక జలవనరుల, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోనసీమ సంక్రాంతి సంబరాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. జనవరి 11వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఆత్రేయపురం కాలువ లాకులు వద్ద స్విమ్మింగ్ పోటీలు ప్రారంభిస్తారని, అదే రోజు ఉదయం 9 నుంచి ముగ్గుల పోటీలు ఆత్రేయపురం ప్రధాన రహదారిపై జరుగుతాయన్నారు. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆత్రేయపురం కెనాల్ వద్ద గాలిపటాల పోటీలు ప్రారంభిస్తారన్నారు. కోనసీమ సంక్రాంతి సంబరాలు గోదావరి ట్రోఫీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జనవరి 12, 13 తేదీల్లో ఆత్రేయపురం కాలువ లొల్ల లాకులు డౌన్ స్ట్రీమ్ వద్ద ఉచ్చిలి దేవాలయం నుంచి బ్రిడ్జి వరకూ జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 28 టీములు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.లక్ష బహుమతిగా అందిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జనవరి 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఆత్రేయపురం హైస్కూల్ గ్రౌండ్‌లో సినీ ఆర్కెస్ట్రా, 12వ తేదీ రాత్రి 7 గంటల నుంచి బాండ్ సేహరి మ్యూజికల్ కార్య క్రమం ఉంటుందన్నారు.
= జిల్లాలో కొబ్బరి క్వాయర్ విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అవ కాశాలు నిండుగా ఉన్నాయని, ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. రాష్ట్ర ఎంఎస్‌ఎం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడికుదురు, ఉప్పలగుప్తం, రావులపాలెం, అమలాపురం, రాయవరం, ద్రాక్షారామాల్లో సంకల్పించిన కొబ్బరి క్వాయరు ఆధారిత పరిశ్రమల ప్రతిపాదనలపై సమీక్షించారు.


