
శంషాబాద్ బస్సుల వేళల్లో స్వల్ప మార్పులు
అమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదారాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఏసీ బస్సుల సమయాలను బుధవారం నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవ కుమార్ తెలిపారు. అమలాపురం నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరే సర్వీస్ ( 2456)ను 5 గంటలకు, 7.30 సర్వీస్ (23545)ను 7 గంటలకు, మధ్యాహ్నం 12.30 సర్వీస్ (23507)ను 12 గంటలకు మార్పు చేశామన్నారు.
బార్ల లైసెన్సులకు
దరఖాస్తులు నిల్
అమలాపురం టౌన్: జిల్లాలోని బార్ల లైసెన్సులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జిల్లా ఇన్‌చార్జి ఎకై ్సజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని పది బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం (17వ తేదీ) ఆఖరి గడువన్నారు. కానీ రాత్రి 7.30 గంటల వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్పారు. కాగా.. జిల్లాకు మొత్తం 11 బార్లు కేటాయించారు. వీటిలో రెండు గీత కులాలకు ఇచ్చారు. అయితే గత నెల 29న ఇవే బార్లకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా అమలాపురంలోని మూడు బార్లకు గాను ఒక బార్‌కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో మిగిలిన పదింటికి రెండో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వీటికి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
విశ్వకర్మకు నివాళి
అమలాపురం రూరల్: సమాజంలో ప్రతి పనికీ విశ్వకర్మ ప్రేరణ ఉందని, ఆయన స్ఫూర్తి ప్రదాత అని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను విశ్వకర్మ స్ఫూర్తితో చేపట్టాలన్నారు. డీఆర్వో మాధవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కాశీ విశ్వేశ్వరరావు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ కార్డుల్లో జిల్లా పేరు
సరిదిద్దడానికి చర్యలు
అమలాపురం రూరల్: కొన్ని స్మార్ట్ రేషన్ కార్డుల్లో జిల్లా పేరు తూర్పుగోదావరిగా నమోదు కావడంతో దాన్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభిమానులు, ప్రజలు, సామాజిక సంఘాల ప్రతినిధుల మనోభావాలు, ఆవేదనను జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా మార్పు చేశామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఇది కనిపిస్తుందన్నారు. ఎడిట్ ఆప్షన్ రాగానే భౌతికంగా కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపిందన్నారు.
ఐటీఐలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో మిగిలిన సీట్లకు నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీజే వర్మ బుధవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఏదైనా ఆన్‌లైన్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను కాకినాడ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు 29వ తేదీన, ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశాలకు 30వ తేదీన హాజరుకావాలని, ఇతర వివరాలకు 94404 08182 నంబరుకు సంప్రదించాలన్నారు.
20న జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కృష్ణప్రభాస్ పేపర్ లిమిటెడ్ 25, టీమ్‌లీజ్ సంస్థ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, పదో తరగతి అపై ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నెంబరుకు సంప్రదింవచ్చన్నారు.
విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి
ఘటిస్తున్న జేసీ నిషాంతి తదితరులు