
అయిన పెళ్లికి.. మళ్లీ బాజా!
అటూఇటూ తిప్పి మొదటికి తెచ్చిన మెగా వాటర్ గ్రిడ్
గత ప్రభుత్వ హయాంలో మంజూరు
రూ.1,650 కోట్ల కేటాయింపు, సర్వే పూర్తి
11 నియోజకవర్గాల్లోని 32 మండలాలు.. 451 గ్రామాలకు మేలు
కాటన్ బ్యారేజీ నుంచి నేరుగా
25 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు
కూటమి ప్రభుత్వం వచ్చాక మరోసారి సర్వే
తాజాగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ ప్రచార యావకు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏడాది మీద రెండు నెలలు మూలన పడింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మధ్య, తూర్పు డెల్టా వాసులకు నేరుగా గోదావరి జలాలను అందించాలనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. రూ.1,600 కోట్లతో మూడు జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలకు మేలు చేయాలని గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు టెండర్లు ఖరారు చేయడంతో పాటు, పక్కాగా సర్వే చేపట్టింది. ఇన్‌లెట్లు, ఫిల్టర్ బెడ్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్, ఓహెచ్‌బీఆర్ నిర్మాణాలు ఎక్కడ చేయాలనేది గత ప్రభుత్వంలో చేపట్టిన సర్వేలోనే నిర్ధారించింది. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తలాతోకా లేకుండా మరోసారి సర్వేలు.. టెండర్ల పేరుతో కాలయాపన చేస్తోంది.
గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నేరుగా డెల్టా వాసుల ఇళ్లకు తరలించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022లో శ్రీకారం చుట్టింది. అప్పటికే జల్‌జీవన్ మిషన్ పనులు జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి డెల్టా విస్తరించి ఉన్న ప్రాంతవాసులకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరు సరఫరా చేయాలని ఈ ప్రాంతవాసులు దశాబ్దాల కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా అనే బృహత్తర ప్రాజెక్టును మొదలు పెట్టింది. రూ.1,650 కోట్ల ఈ ప్రాజెక్టు టెండర్‌ను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు, 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగు నీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది.
మత్స్యకార, లంక గ్రామాలకు మేలు
మెగా వాటర్ ప్రాజెక్టు ద్వారా కోనసీమ జిల్లాలో మధ్య డెల్టాలోకి వచ్చే అమలాపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్లలో అన్ని గ్రామాలతో పాటు, తూర్పు డెల్టా పరిధిలోని రామచంద్రపురం డివిజన్‌లోని గ్రామాలు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రాజమహేంద్రవరం రూరల్, కడియం మండల గ్రామాల్లోని ఇళ్లకు నేరుగా గోదావరి జలాలు అందాల్సి ఉంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో తీరాన్ని ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాలకు, గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు ప్రధానంగా మేలు చేకూరాల్సి ఉంది.
జల్‌జీవన్‌కు అనుసంధానిస్తూ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డెల్టా పరిధిలోని 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్‌ల ద్వారా తాగునీరు అందుతోంది. పాత ప్రాజెక్టులకు అనుసంధానంగా కొత్త నిర్మాణం జరగనుంది. ఇప్పటికే జల్‌జీవన్ మిషన్‌లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. జల్‌జీవన్ మిషన్‌తో చేపట్టే పనులతో పాటు, వినియోగంలో ఉన్న పాత ప్రాజెక్టుల సామార్థ్యాన్నీ అప్పుడే సర్వే చేశారు. ఆయా మండలాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు అక్కరకు రాకుంటే, వాటి స్థానే, అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాల్సిన ప్రాంతాలను అప్పటి సర్వేలోనే గుర్తించారు.
గతంలోనే పూర్తయిన సర్వే
ఈ పనులను గత ప్రభుత్వ హయాంలో మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థతో పాటు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా 2023 ఏప్రిల్ నెలాఖరు నాటికే సర్వే దాదాపు ముగించారు. భారీ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ (ఆర్‌ఎస్‌ఎఫ్)లను ఒక్కొక్క దానిని 30 నుంచి 50 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) సామర్థ్యంతో నిర్మించాలని తేల్చారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్), ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఓహెచ్‌బీఆర్)లకు పంపిస్తారు. వీటి నిర్మాణాలకు అవసరమైన భూమిని గుర్తించేందుకు కూడా సర్వే చేశారు. మధ్య డెల్టాకు సంబంధించి ఆత్రేయపురం మండలం వద్దిపర్రు వద్ద 12 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తూర్పు డెల్టాకు సంబంధించి ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి కడియం మండలం జేగురుపాడులో స్థలాన్ని సేకరించాలని భావించారు. అక్కడ మొత్తం స్థలం లభించకుంటే, కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గ గ్రామాలకు మడికి వద్ద ఫిల్టర్ బెడ్ రూమ్ స్థలాన్ని సేకరించాలని అధికారులు అప్పట్లోనే ఓ అంచనాకు వచ్చారు. మధ్య డెల్టాకు ఇటు బొబ్బర్లంక వద్ద ఓ ఇన్‌టేక్ వెల్, తూర్పు డెల్టాకు ధవళేశ్వరం వద్ద మూడు ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయాలు జరిగాయి.
మొదటికి తెచ్చిన ’కూటమి’
ప్రాజెక్టు పనులు మొదలయ్యే సరికి ఎన్నికలు రావడం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కన్నా, తమ ఘనతగా చాటుకోవాలనే ఉద్దేశంతో మరోసారి సర్వే చేయించి, టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైంది. ఇంతా చేస్తే పాత సర్వే ఆధారంగానే పనులు చేపట్టనున్నట్టు సమాచారం. త్వరలో టెండర్లు పిలిచే అవకాశముంది. ఈ పనులు కూడా మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకోవచ్చు. ఈ మాత్రం దానికి ఇదేదో తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకొనేందుకు ఏడాదిపై రెండు నెలల పాటు విషయాన్ని నాన్చింది. టెండర్లు పూర్తయి, పనులు మొదలయ్యే సరికి మరో నాలుగు నెలలు అనుకుంటే ఏడాదిన్నర ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్టే. ప్రజోపయోగ అంశాల్లో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై ఉమ్మడి జిల్లావాసులు మండిపడుతున్నారు.

అయిన పెళ్లికి.. మళ్లీ బాజా!

అయిన పెళ్లికి.. మళ్లీ బాజా!